ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దర్మయుద్ద మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య తెలిపారు
ఆమనగల్లు(మహబూబ్‌నగర్ జిల్లా): శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని కోరుతూ ఈనెల 27న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దర్మయుద్ద మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ధర్మయుద్ద మహాసభ పోస్టర్లను స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 23 ఏళ్లుగా పవిత్ర యుద్దం చేస్తుందని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించి తీరుతుందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ సాధన కోసం ఎమ్మార్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని, డిల్లీ వేధికగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేసిందని ఆయన వివరించారు. ఈనెల 23న జరిగే ధర్మయుద్ద మహాసభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.