లారీ.. ఏ దారి? | Moving to lorry with a suspected marijuana Gangavaram port | Sakshi
Sakshi News home page

లారీ.. ఏ దారి?

Mar 27 2017 4:21 AM | Updated on Sep 5 2017 7:09 AM

లారీ.. ఏ దారి?

లారీ.. ఏ దారి?

ఏజెన్సీ నుంచి అనేక మార్గాల్లో.. అనేక విధాలుగా గంజాయి ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి విదేశాలకు అక్రమంగా

గంజాయి లారీ గంగవరం పోర్టు వైపు వెళ్లడంతో అనుమానాలు!
అక్రమ రవాణా ఎళ్లలు దాటుతున్నా దృష్టి సారించని అధికారులు
‘డీఆర్‌ఐ’కు పట్టుబడిన సరకు విలువ రూ.కోటి పైమాటే
కేసును తారుమారు చేసేందుకు యత్నాలు


విశాఖపట్నం : ఏజెన్సీ నుంచి అనేక మార్గాల్లో.. అనేక విధాలుగా గంజాయి ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి విదేశాలకు అక్రమంగా రవాణా జరుగుతోంది. స్థానికంగా జరిగే రవాణాపై తప్ప విదేశాలకు జరిగే స్మగ్లింగ్‌పై ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పెద్దగా దృష్టి సారించింది లేదు. పోనీ స్థానికంగానైనా అడ్డుకుంటున్నారా అంటే.. మాటలు తప్ప పెద్దగా దృష్టి సారించింది లేదు. కలెక్టర్‌ దగ్గర్నుంచి అన్ని ప్రభుత్వ విభాగాల అధికార ప్రతినిధులు ప్రత్యేకంగా కమిటీగా ఏర్పడి సమీక్షలు జరిపినా ఆశించినంత ఫలితం కనిపించలేదు. అయితే గంజాయి అక్రమ రవాణాపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డీఆర్‌ఐ) కొట్టిన దెబ్బ సంచలనమైంది.

విశాఖ ఏజెన్సీ నుంచి జాతీయ రహదారి మీదుగా శనివారం రాత్రి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌ లారీని షీలానగర్‌ సమీపంలో డీఆర్‌ఐ విశాఖ ప్రాంతీయ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లారీలో రూ.కోటిపైగా విలువైన 1,161 కిలోల గంజాయిని గుర్తించినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. స్మగ్లర్లు తెలివిగా ఎవరికీ అనుమానం రాకుండా 3 కిలోల చొప్పున 386 ప్యాకెట్లుగా చేసి లారీలో ఎక్కించారు. వాటిపై టార్పాలిన్‌ కప్పి, దానిపై గ్రావెల్‌ పోసేశారు. చూసిన వారెవరైనా గ్రావెల్‌ లారీగానే భావిస్తారు తప్ప లోపల గంజాయి ఉందనే అనుమానం ఏ మాత్రం రాదు. ట్రక్కుల్లో పైకి కనిపించని చోట, ఆటోల కింద, అంబులెన్సుల్లో, చివరికి మనిషి నడుం చుట్టూ కట్టుకుని కూడా గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్న ఉదంతాలు చాలానే వెలుగు చూశాయి. కానీ ఇంత భారీ స్థాయిలో రాళ్ల మాటున మత్తు మందు రవాణా సాగిస్తుండటం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

ఇంత భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా వెనుక చాలా పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీ నుంచి విదేశాలకు నేరుగా విశాఖ నుంచే స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. గంజాయి లోడుతో లారీ గంగవరం పోర్టుకు వెళుతుండగా గంగవరం ఫ్లైఓవర్‌ వద్ద డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారని ముందుగా వార్తలు వెలువడ్డాయి. కానీ అధికారిక ప్రకటనలో ఆ ప్రస్థావన లేదు. దీనికి తెరవెనుక పెద్దల మంత్రాంగం నడిపినట్లు సమాచారం. లారీతో పట్టుబడ్డ వ్యక్తిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరి కోసం వేట ప్రారంభించామని డీఆర్‌ఐ చెబుతోంది. కానీ లారీ వెళ్లిన మార్గాన్ని బట్టి చూస్తే కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడి నుంచి బయలుదేరిన సరకు వయా పెందుర్తి, గోపాలపట్నం, ఎన్‌ఎడీ, షీలానగర్, గాజువాక మీదుగా విజయవాడ వైపు వెళ్లాలి. కానీ గాజువాక నుంచి యుటర్న్‌ తీసుకుని కొత్త గాజువాక వైపుగా బార్‌ చెరువు రోడ్డు నుంచి గంగవరం పోర్టుకు చేరుతుండగా ఫ్లైఓవర్‌ వద్ద డీఆర్‌ఐ అధికారులు లారీ పట్టుకున్నట్లు  తెలిసింది. డీఆర్‌ఐ అధికారులు లారీని సరకుతో సహా షీలానగర్‌లోని ఓ గోడౌన్‌కు తరలించారు. ఆ సమయంలో సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గాజువాక పోలీసులను కూడా వారు గోడౌన్‌లోకి అనుమతించలేదు.

ఆదివారం నాటి ప్రకటనలో మాత్రం లారీని షీలానగర్‌ సమీపంలో పట్టుకున్నామని మాత్రమే చెప్పారు. మిగతా విషయాలు దాచిపెట్టడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఏజెన్సీ నుంచి ఇంత భారీ స్థాయిలో సరుకు గంగవరం పోర్టు వైపు వెళ్లడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసు ఆధారంగా పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు గంజాయి స్మగ్లింగ్‌ జరిగే అవకాశాలపై డీఆర్‌ఐ అధికారులు లోతుగా పరిశోధన చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement