
ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం
మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకరమైన ఫెంటానిల్ మాదకద్రవ్యం తయారీలో ఉపయోగించే రసాయనాల అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న భారతీయ కంపెనీల ఉన్నతాధికారులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఉన్నతాధికారుల వీసాలను రద్దు చేసినట్లు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ట్రంప్ పరిపాలన విధానాల్లో భాగంగా అమెరికన్లను ప్రమాదకరమైన సింథటిక్ నార్కోటిక్స్ నుండి రక్షించే ప్రయత్నంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎంబసీ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదలచేసింది.
కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతోపాటు వారి కుటుంబ సభ్యులను అమెరికాకు ప్రయాణించడానికి అనర్హులుగా ప్రకటించింది. ఇప్పటికే వాళ్లలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల అభ్యర్థనలను తిరస్కరించామని పేర్కొంది. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 221(ఐ), 212(ఎ)(2)(సీ), 214(బీ) సెక్షన్లకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఫెంటానిల్ రసాయనాల స్మగ్లింగ్ చేసే కంపెనీలకు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లు భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేస్తే లోతైన పరిశీలన, అధ్యయనం తప్పవని యూఎస్ రాయబార కార్యాలయ ప్రతినిధి జోర్గాన్ ఆండ్రూస్ చెప్పారు.