విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా

Published Mon, Sep 4 2017 1:32 PM

విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా

మోసపోయిన ఆంజనేయపురానికి  చెందిన 8 మంది యువకులు
రూ. 80 వేలు చొప్పున అర్పించిన వైనం
పోలీసులకు ఫిర్యాదు


టెక్కలి రూరల్‌: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురు యువకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠా చేతిలో మోసపోయామని ఆంజనేయపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు టెక్కలి ఎస్‌ఐ జి.రాజేష్‌ వద్ద వాపోయారు. ఈ మేరకు బాధితులు ముడిదాన గిరిరాజు, రాము స్థానిక పోలీసు స్టేషన్‌కు ఆదివారం వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం...  క్యూనెట్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని గ్రామానికి చెందిన కొందరు యువకులను ఆ సంస్థ ప్రతినిధులు నమ్మించారు. సభ్యత్వం కావాలంటే ముందుగా రూ. 80 వేలు సదరు సమస్థ ప్రతినిధులకు అప్పజెబితే వారు సభ్యత్వం కింద ఒక వాచీ ఇస్తారు.

వాచీ అందుకున్న సదరు యువకుడు మరో ముగ్గురిని జాయిన్‌ చేసుకోవాలి. ఒక్కొక్కరి వద్ద రూ. 80 వేల చొప్పున వసూలు జరిగిన తర్వాత చైన్‌ లింక్‌ పద్ధతి ప్రకారం ఒక్కొక్కరు ముగ్గురిని చొప్పున జాయిన్‌ చేసుకోవాలని ఇలా చేరిన వారికి విశాఖపట్నంలో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తామని అనంతరం హాంకాంగ్, మలేషియా వంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు సంస్థ ప్రతినిధులు యువకులను నమ్మించారు. దీంతో ఆంజనేయపురం గ్రామానికి చెందిన సుమారు 8 మంది వ్యక్తులు రూ. 80 వేల చొప్పున చెల్లించారు. ముందుగా హైదరాబాద్‌ చేరుకున్న వీరికి నెల రోజుల తర్వాత విశాఖపట్నం పంపారు.

అక్కడ ఒక చిన్న గదిలో కంప్యూటర్‌పై అవగాహన అని చెప్పి కొద్దిరోజులు గడిపిన తర్వాత వీరి నుంచి మరికొంతమంది మిత్రులు, బంధువుల ఫోన్‌ నంబర్‌లను సేకరించారు. వారిని కూడా సభ్యులుగా చేర్చమని ఒత్తిడి తెచ్చేవారని బాధిత యువకులు తెలిపారు. సంస్థ తీరుపై అనుమానం వచ్చి తాము మోసపోయినట్టు గ్రహించామని బాధితులు ఎస్‌ఐకి చెప్పారు. దీనిపై స్పందించిన ఎస్‌ఐ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పలు బోగస్‌ సంస్థలు ఉన్నాయన్నారు. వాటిని నమ్మి యువత మోసపోవడం తగదని చెప్పారు. క్యూనెట్‌ అనే అంతర్జాతీయ సంస్థ, ఆ సంస్థ ప్రతినిధుల ఆచూకీకి కృషి చేస్తామని ఎస్‌ఐ తెలిపినట్టు బాధితులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement