మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ
ఏలూరు అర్బన్ : మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తులు సమర్పించడంతో పాటు వెరిఫికేషన్‌కు కూడా గురువారం ఆఖరిరోజు కావడంతో మద్యం వ్యాపారులు భారీగా తరలివచ్చారు.
ఏలూరు అర్బన్ : మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తులు సమర్పించడంతో పాటు వెరిఫికేషన్‌కు కూడా గురువారం ఆఖరిరోజు కావడంతో మద్యం వ్యాపారులు భారీగా తరలివచ్చారు. దాంతో స్థానిక అశోక్‌నగర్ ప్రాంతం సందడిగా మారి జాతరను తలపించింది. రద్దీని ముందుగానే అంచనా వేసిన డెప్యూటీ కమిషనర్ దరఖాస్తుల స్వీకారానికి వచ్చిన వ్యాపారులకు ఎంట్రీ పాస్‌లు ఇవ్వడం ద్వారా హడావుడి పడకుండా వ్యాపారులు తమకు ముందుగా నిర్ణయించిన సమయానికి డీసీ కార్యాలయానికి వచ్చి తమకు కేటాయించిన స్టాళ్లలో దరఖాస్తులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు, భీమవరం యూనిట్‌ల పరిధిలోని 13 ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలో 474 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సాయంకాలం 6.30 వరకూ తమకు 8,485 దరఖాస్తులు అందాయన్నారు. ఈ దరఖాస్తుల ద్వారా తమ శాఖకు రూ.39 కోట్లకు పైబడి ఆదాయం సమకూరిందన్నారు. రాత్రి 8 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించి వెరిఫికేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం శుక్రవారం స్థానిక మినీ బైపాస్ రోడ్దులోని శ్రీ కన్వెన్షన్ హాలులో మద్యం దుకాణాలకు సంబంధించి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు.