మహా గెలుపు

మహా గెలుపు - Sakshi


ఖేడ్‌లో గులాబీ గుబాళింపు

మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజయదుందుభి

53,625 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ గెలుపు

అభివృద్ధి వైపే నడిచిన ‘ఖేడ్’ ఓటరు

{పతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం

డిపాజిట్ నిలుపుకొన్న కాంగ్రెస్

టీడీపీ ధరావత్తు గల్లంతు
 ఖేడ్ ఉప ఎన్నికల్లో గులాబి గుబాళించింది. కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. టీఆర్‌ఎస్ ధాటికి ‘హస్తం’ దెబ్బతింది. ‘సైకిల్’కు పంక్చరైంది. కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకోగలిగింది. గెలుస్తామనే ధీమాతో బరిలోకి దిగిన టీడీపీ ధరావత్తు కోల్పోయింది. సానుభూతి పవనాలు వీయకపోవడంతో కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్‌ఎస్ ఘన విజయాన్ని సాధించింది. కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుని విజయ ఢంకా మోగించింది. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఖేడ్ చరిత్రనే తిరగరాశారు. నారాయణఖేడ్: నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా మెజార్టీని టీఆర్‌ఎస్ సాధించింది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి పాగా వేసింది. మొదటి రౌండ్ నుంచి చివ రి రౌండ్ వరకు ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఆధిక్యతను కనబరిచారు. రమారమి ప్రతి రౌండ్‌లో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డిపై రెండు వేలు, ఆపైగా ఆధిక్యతతో పైచేయి సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గత ఏడాది ఆగస్టు 25న గుండెపోటు తో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 13న పోలింగ్ జరగ్గా మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 93,076 ఓట్లను పొందగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డి 39,451 ఓట్లను సాధించారు.


కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి ఎం.విజయపాల్‌రెడ్డి 14,787 ఓట్లను మాత్రమే పొందడంతో డిపాజిట్ గల్లంతయ్యింది. ఈ ఎన్నికల్లో డిపాజిట్ పొందేం దుకు పోలైన వాటిలో 16 శాతం అంటే 25,811 ఓట్లు రావాల్సి ఉంది. స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్న శ్రమజీవి పార్టీ అభ్యర్థి జి. భాస్కర్ 5,377 ఓట్లు, బోరంచ సంగారెడ్డి 509, ఐ.మాదప్ప 235, ముదిరాజ్ వెంకటేశం 291, మురళీగోవింద్ 333ఓట్లను పొందారు. నోటా కు 853 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ రోనాల్డ్ రాస్, రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, పరిశీలకులు నరేంద్రసింగ్ పాటిల్, జీఎల్ మీన, రాజేష్ కుమార్‌రాయ్, జెడ్పీ సీఈఓ వర్షిణి తదితరులు పర్యవేక్షించారు. 8.40 గంటలకే తొలి రౌండ్ ఫలితం

 ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉదయం 7.30 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లను అధికారులు కౌంటింగ్ హాల్‌లోకి పంపించారు. మొదటి రౌండ్ ఫలితం 8.40 గంటలకు వెల్లడించారు. ఆ తరువాత ప్రతి పది పదిహేను నిమిషాల వ్యవధిలో ఒక్కోరౌండ్ ఫలితం వచ్చింది. కౌంటింగ్ హాల్, మీడియా పాయింట్‌లో ప్రత్యేక తెరల ద్వారా ఫలితాలను వెల్లడించారు.

 ధ్రువపత్రం అందుకున్న భూపాల్‌రెడ్డి..

పెద్దశంకరంపేట: ఉప ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు చేత ధ్రువపత్రాన్ని అందుకున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top