కిమ్స్‌లో మహారాష్ట్ర యువకుడికి కాలేయ మార్పిడి


హైదరాబాద్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. నెల్లూరుకు చెందిన దినేష్‌రెడ్డి (31) కొంత కాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం వారం క్రితం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో శుక్రవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్‌లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది.



రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 7.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అటు నుంచి ట్రాఫిక్ పోలీసుల సహాయం (గ్రీన్ చానల్)తో కిమ్స్‌కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, సాధారణంగా 1 సెంటీమీటర్ల మందంలో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటిమీటర్ల మందంలో ఉండటం వల్ల అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్‌రావు వెల్లడించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top