
‘కృష్ణా’ ఎక్స్‌ప్రెస్
పుష్కర భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు రైళ్లకు విష్ణుపురం (వాడపల్లి)లో ఆగేందుకు అనుమతిచ్చిన అధికారులు నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లకూ అవకాశం కల్పించారు
పుష్కరాలకు నాన్‌స్టాప్ రైళ్లు...
హైదరాబాద్ నుంచి రోజూ రెండు స్పెషల్ ట్రెయిన్లు
నాంపల్లి – గుంటూరు... గుంటూరు–నాంపల్లి
సికింద్రాబాద్‌లో బయలుదేరితే ఆగేది వాడపల్లిలోనే..
రిజర్వేషన్ ఉండదు.. ఎవరైనా ఎక్కొచ్చు..
ఎనిమిది సాధారణ.. రెండు స్లీపర్ క్లాస్ బోగీల ఏర్పాటు
ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరితే సాయంత్రానికి మళ్లీ వెళ్లేలా ఏర్పాట్లు
వీటికి తోడు అదనంగా మరో నాలుగు సర్వీసులు
ఇప్పటికే మూడు ఎక్స్‌ప్రెస్‌లకు విష్ణుపురంలో ఆగేందుకు అనుమతి
పుష్కర భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు రైళ్లకు విష్ణుపురం (వాడపల్లి)లో ఆగేందుకు అనుమతిచ్చిన అధికారులు నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లకూ అవకాశం కల్పించారు. ఉదయం 5:40 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి)లో రైలు ఎక్కితే 9:18 కల్లా విష్ణుపురానికి రావొచ్చు.. అక్కడ పుష్కర స్నానమాచరించి మళ్లీ సాయంత్రం 3:40 గంటలకు రైలు ఎక్కితే 8:30 కల్లా హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే మరో అరగంట వెనుక ఎక్కవచ్చు.. ఓ అరగంట ముందే దిగిపోవచ్చు. అంటే.. ఉదయం బయలుదేరి పుష్కర స్నానం చేసుకుని సాయంత్రానికి హాయిగా రైలులో గమ్యస్థానానికి వెళ్లిపోవచ్చన్నమాట. మరో మాటండోయ్.. ఈ రైళ్లు ఎక్కడా ఆగవు.. సికింద్రాబాద్‌లో బయలుదేరితే మళ్లీ వాడపల్లిలోనే. ఇక్కడి నుంచి బయలుదేరితే సికింద్రాబాద్‌లోనే ఆగుతాయి. ఈ రైళ్లకు రిజర్వేషన్లు కూడా ఉండవు. ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ముందు వస్తే... ఏ బోగీలో కావాలంటే అందులో కూర్చోవచ్చు. హాయిగా హైదరాబాద్ నుంచి వాడపల్లికి రావచ్చు... వాడపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లొచ్చు.
– సాక్షి ప్రతినిధి, నల్లగొండ