గర్వంగా ఉంది.. | i feekl proud says kanyakumari | Sakshi
Sakshi News home page

గర్వంగా ఉంది..

Jul 24 2016 11:51 PM | Updated on Sep 4 2017 6:04 AM

అవసరాల కన్యాకుమారి

అవసరాల కన్యాకుమారి

సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ వయోలిన్‌ విధ్వాంసురాలు అవసరాల కన్యాకుమారి తెలిపారు.

‘సంగీత కళానిధి’ అవార్డుకు ఎంపికైన కన్యాకుమారి  
 
విజయనగరం టౌన్‌ :  సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ వయోలిన్‌ విధ్వాంసురాలు అవసరాల కన్యాకుమారి తెలిపారు. అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ఆమె సాక్షితో ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు తనకు అకాడమీ నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన తనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం గొప్పవిషయమని చెప్పారు. తన  తల్లిదండ్రులతో పాటు గురువు కీర్తిశేషులు ఇవటూరి విజయేశ్వరరావు, చంద్రశేఖరం (చెన్నై), వసంతకుమారి (చెన్నై)ల ఆశీర్వాదం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. విజయనగరంలోని కొత్త అగ్రహారంలో ద్వారం నరసింగరావు పాఠశాలలో విద్యాభ్యాసం చేశానన్నారు. పద్మశ్రీతో పాటు సంగీత కళానిధి అవార్డుకి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆమెకు అవార్డు రావడం పట్ల జిల్లా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. 
 
వయోలిన్‌ కళలోనే ఆమె కళానిధి
వయోలిన్‌ రంగంలో ఆమె వాస్తవంగానే కళానిధి కాబట్టే సంగీత కళానిధి అవార్డు వచ్చింది. ఆమెకు దక్కిన పురస్కారం విజయనగర వాసులందరిదీ. భారత ప్రభుత్వం నుంచి మరిన్ని ఉన్నత పురస్కారాలు రావాలి. 
 – సముద్రాల గురుప్రసాద్, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు 
 
 
జిల్లాకు గర్వకారణం
కన్యాకుమారి జిల్లాకు చెందిన కళాకారిణి అని చెప్పుకునేందుకు మనమెంతో గర్వపడాలి. జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందడం అభినందనీయం, ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల వంటి వారి సరసన నిలవడం అభినందనీయం. 
 –కాపుగంటి ప్రకాష్,  గురజాడ సమాఖ్య ప్రధాన కార్యదర్శి
 
ఆనందంగా ఉంది
విజయనగరం వాసి కన్యాకుమారికి పురస్కారం రావడం ఆనందంగా ఉంది. గతేడాది పద్మశ్రీ పురస్కారం అందింది. ఈ ఏడాది సంగీత కళానిధి రావడం మరింత ఆనందంగా ఉంది.  
 – ఎన్‌కే బాబు,  సహజ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు 
 
 
మరింత ఖ్యాతి గడించాలి
గతేడాదే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి అవార్డు వచ్చింది. మన్ముందు భారతరత్న వంటి పురస్కారాలు రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది  మంచి శిషు్యలు తయారుకావాలి.
––మండపాక రవి, ప్రముఖ మృదంగ విధ్వాంసులు

Advertisement
Advertisement