తగ్గిన సత్యదేవుని హుండీ ఆదాయం | hundi income loss | Sakshi
Sakshi News home page

తగ్గిన సత్యదేవుని హుండీ ఆదాయం

Mar 30 2017 11:29 PM | Updated on Sep 5 2017 7:30 AM

గత నవంబర్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం సత్యదేవుని హుండీ ఆదాయంపై కూడా పడింది. గత ఐదేళ్లుగా ఏటా రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు పెరుగుతూ వస్తున్న స్వామివారి హుండీ ఆదాయం 2016–17లో పెరగలేదు సరికదా

అన్నవరం :
గత నవంబర్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం సత్యదేవుని హుండీ ఆదాయంపై కూడా పడింది.  గత ఐదేళ్లుగా ఏటా రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు పెరుగుతూ వస్తున్న స్వామివారి హుండీ ఆదాయం 2016–17లో పెరగలేదు సరికదా సుమారు రూ.17.50 లక్షలు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా దేవస్థానంలోని హుండీలను తెరిచి గురువారం లెక్కించారు. దేవస్థానంలోని స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సాగిన హుండీ లెక్కింపులో రూ.36,00,094 ఆదాయం వచ్చింది. ఇందులో నగదు రూ 33,55,019 కాగా,  చిల్లర నాణాలు రూ.2,45,075. ఈ మొత్తంతో కలిపి 2016–17లో వచ్చిన హుండీ ఆదాయం రూ.12, 41,50, 998 కి చేరింది. 
2015–16 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం హుండీ ఆదాయం రూ.12,59,06,490 వచ్చింది. దీంతో పోల్చితే గత ఏడాది హుండీ ఆదాయం కన్నా ఈ సంవత్సరం రూ. 17.50 లక్షలు తగ్గింది.
బడ్జెట్‌ అంచనా కన్నా కూడా తక్కువే..
2016–17 సంవత్సరంలో హుండీల ద్వారా రూ.12.65 కోట్లు ఆదాయం వస్తుందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు కూడా తారుమారయ్యాయి. సుమారు రూ.24 లక్షలు తక్కువగా హుండీ ఆదాయం వచ్చింది. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్లు హుండీల ద్వారా ఆదాయం రాగలదని వేసిన అంచనాలు కూడా మార్చుకోవల్సి వస్తుందేమోనన్న అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
గత మూడేళ్లుగా అన్నవరం దేవస్థానానికి వచ్చిన హుండీ ఆదాయం వివరాలు
2014–15.... రూ.11,04,03,076
2015–16... రూ.12,59,06,490
2016–17... రూ.12,41,50,998 
2017–18... రూ.15,00,00,000
(బడ్జెట్‌లో ప్రతిపాదన)
తప్పని పాతనోట్ల బెడద...
గురువారం హుండీ లెక్కింపులో కూడా రద్దయిన రూ.500, రూ.వేయి నోట్లు దర్శనమిచ్చాయి. రూ.వేయి నోట్లు 20, రూ.500 నోట్లు 47 వచ్చాయి. ఇప్పటికే దేవస్థానం వద్ద పాతనోట్లు రూ.4.77 లక్షలున్నాయి. వాటిని మార్పిడి చేయాలని ఆర్‌బీఐని కోరినా తిరస్కరించిన విషయం విదితమే. గురువారం హుండీల ద్వారా వచ్చిన  పాత నోట్లతో కలిపి పాత నోట్లు రూ.5,20,500కి చేరాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement