
ఇంకెన్నేళ్లు తిప్పుతారయ్యా!
ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని మీకోసం విభాగంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో అర్జీదారులు
⇒15 ఏళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా
⇒అర్హత ఉందంటూనే .. తిప్పి పంపుతున్నారు
⇒కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో దివ్యాంగురాలి ఆవేదన
⇒ఇప్పటికైనా కనికరించాలని వినతి
విశాఖ సిటీ : ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని మీకోసం విభాగంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో అర్జీదారులు తమ కష్టాలను అధికారులకు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మీ కోసం కార్యక్రమంలో 215 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది గృహాలు మంజూరు చేయాలంటూ వినతిపత్రాలు అందించారు. వీటితో పాటు రేషన్ కార్డులు, భూ వివాదాలు, పింఛన్ల మంజూరు సహా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు పెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్–2 డి.వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, సెట్విన్ సీఈవో డా.సిరి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఎండలు పెరుగుతుండడంతో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు పైకి వెళ్లి సమస్యలు విన్నవించుకునేందుకు అవస్థలు పడ్డారు.
డయల్ యువర్ కలెక్టర్ రద్దు
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేశారు. ఐసీడీఎస్ సమావేశం జరిగిన హాల్లోనే కార్యక్రమానికి సంబంధించిన ఉపకరణాలు ఉండటం వల్ల, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అందుబాటులో లేనందువల్ల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చేవారం యధావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
మెట్లు ఎక్కలేకపోతున్నాం
దివ్యాంగుల కోటాలో రేషన్ కార్డు మంజూరు చెయ్యమని ఆరు నెలలుగా తిరుగుతున్నాను. అయినా, అధికారులు స్పందించడం లేదు. మెట్లు ఎక్కి పైకి వెళ్లాలంటే నరకయాతనగా ఉంది. అయినా, కార్డు ఇస్తారనే ఆశతో ప్రతి వారం వస్తున్నాను. వచ్చిన ప్రతిసారీ అర్జీ తీసుకుంటున్నారే తప్ప అధికారుల నుంచి మాత్రం స్పందన లేదు.
– మల్లా నర్సింహరామ, గవర కంచరపాలెం
రుణాల మంజూరులో అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు
విశాఖ సిటీ : ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు విషయంలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ కంచరపాలేనికి చెందిన అప్పారావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జోన్–4 కార్యాలయ పరిధిలోని 35,36,37 వార్డుల్లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను అక్కడి అధికారులు, స్థానిక బీజేపీ నేతతో కలిసి లంచాలు తీసుకుని, అర్హత లేని వాళ్లకు మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకూ లంచం తీసుకున్నారని ఆరోపించారు. జోన్–4 కార్యాలయం ఏపీడీ, యూసీడీ విభాగంలో కొంతమంది బీజేపీ నేతల కుటుంబ సభ్యులు ఉద్యోగులుగా చేరి చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుదారుల నుంచీ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.