గంగమ్మ ఒడికి గౌర మ్మా..

గంగమ్మ ఒడికి గౌర మ్మా..

  • సద్దుల బతుకమ్మ

  • నేడు పలుప్రాంతాల్లో సంబరాలు

  • వర్షం ఎఫెక్ట్‌

  • నిద్రపో గౌరమ్మ... నిద్రపోవమ్మా...

    నిద్రకు నూరేండ్లు.... నీకు వెయ్యేండ్లు...

    నినుగన్న తల్లికి నిండు నూరేళ్లు... 

    వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా’ అంటూ బతుకమ్మ అంటూ మహిళలు వీడ్కోలు పలికారు. 

     

    కరీంనగర్‌:  జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో పూజించి గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. అయితే ఈసారి బతుకమ్మ పండుగపై పండితులు ఒక స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆదివారం కూడా జిల్లాలో పలుచోట్ల సంబరాలు జరుగనున్నాయి. మరోవైపు బతుకమ్మ పండుగకు వర్షం అడ్డంకిగా మారింది. రాత్రివరకు వాన కురియడంతో మహిళలు ఆడేందుకు ఇబ్బందులు పడ్డారు. 

     

     

    జిల్లా కేంద్రంలోని 41, 42వ డివిజన్లలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ పాల్గొన్నారు. 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ చల్లా స్వరూపరాణì  పేర్చిన 10 అడుగుల బతుకమ్మ ఆకట్టుకుంది. హుస్నాబాద్‌లో మహిళలు వానలోనే బతుకమ్మ ఆడారు. బతుకమ్మలపై విద్యుత్‌ స్తంభంపడడంతో పరుగులు పెట్టారు. కరెంట్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. మూడుగంటలపాటు వర్షం పడడంతో వానలోనే బతుకమ్మ ఆడారు. వర్షం ఎఫెక్ట్‌తో కొందరు బతుకమ్మ ఆట ఆడకుండానే నిమజ్జనం చేశారు. చొప్పదండిలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక కుడి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గోదావరిఖనిలోని కోదండరామాలయం, కాశీవిశ్వేశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం, పవర్‌హౌస్‌లోని దుర్గామాత ఆలయాల వద్ద బతుకమ్మను భక్తిశ్రద్ధలతో ఆడి పాటలు పాడారు. కోలాటాలతో సందడి చేశారు. రాజీవ్‌నగర్‌లో దేశంకోసం అమరులైన వీరజవాన్లకు బతుకమ్మ ఆటలతోపాటు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు. ౖయెటింక్లయిన్‌కాలనీలో వర్షం కురుస్తున్నా మహిళలు బతుకమ్మ ఆడేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. హుజూరాబాద్‌ పట్టణంలో మహిళలు, యువతులు, చిన్నారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ సద్దుల ప్రాంగణానికి చేరుకుని ఆడారు. అనంతరం స్థానిక వాగులో నిమజ్జనం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ వేడుకలకు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. జగిత్యాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో జెడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన, జగిత్యాల సబ్‌ కలెక్టర్‌ శశాంక దంపతులు పాల్గొన్నారు. కరీంనగర్‌ మండలం సీతారాంపూర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మంథనిలో గౌరమ్మను కొలిచి బతుకమ్మ ఆటాపాటలతో అలరించారు. సుల్తానాబాద్‌ మండల కేంద్రంలో బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళలు చెరువులో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. వేములవాడలో మూడురోజుల క్రితమే సద్దుల వేడుకలు నిర్వహించగా.. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం జరుపుకున్నారు. సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, జగిత్యాల ప్రాంతాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top