ప్రజలకు మొండిచేయి చూపుతున్న టీడీపీ
గొరిగపూడి(భట్టిప్రోలు):
ఎన్నికలకు ముందు టీడీపీ రకరకాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు.
గొరిగపూడి(భట్టిప్రోలు): ఎన్నికలకు ముందు టీడీపీ రకరకాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. భట్టిప్రోలు మండలం గొరిగపూడిలో ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటేశ్వరరావు ఇంట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీలు ఇచ్చి జనాలను మోసం చేశారన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి ఫించన్లు అందకుండా చేస్తున్నారని, జన్మభూమి కమిటీ సభ్యులు అనుకూలమైన వారికే పథకాలు వర్తింప చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని నేతలు అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వారు మాఫియాలకు పాల్పడుతున్నారన్నారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికి హోదా విషయంలో కప్పదాట్లు వేశారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. భారత దేశంలో ఆర్థిక మాంద్యం రాబోతుందని నోట్ల రద్దు విషయం ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుండేదని తెలిపారు. ప్రజలు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని తెలిపారు.