
నీటిశుద్ధి యంత్రంలో బంగారు గుళికలు
సముద్రమార్గాన్ని ఎంచుకున్న తమిళనాడుకు చెందిన బంగారం స్మగ్లర్‌కు భారతదేశంలో అడుగుపెట్టేవరకు అంతా అనుకున్నట్లే జరిగింది.
అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల గోల్డ్ పట్టివేత
సాక్షి, విజయవాడ బ్యూరో: సముద్రమార్గాన్ని ఎంచుకున్న తమిళనాడుకు చెందిన బంగారం స్మగ్లర్‌కు భారతదేశంలో అడుగుపెట్టేవరకు అంతా అనుకున్నట్లే జరిగింది. కోల్‌కతాలో దిగి ట్రైన్‌లో చెన్నైకు ఐదు కేజీల బంగారం తీసుకెళ్లడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. బంగారాన్ని గుళికల రూపంలోకి మార్చి నీటిశుద్ధి యంత్రంలో(ఫిల్టర్)లో దాచి రైలు ఎక్కాడు. ఈ అక్రమ రవాణా గుట్టును రాష్ట్ర కస్టమ్స్ అధికారులు రాజమహేంద్రవరంలో రైలును ఆపి రట్టు చేశారు.
స్మగ్లర్ల వద్ద నుంచి రూ. 1.45 కోట్ల విలువైన 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కే రెహమాన్ మంగళవారం విజయవాడ కేంద్ర కార్యాలయంలో విలేకరులకు వివరించారు. అదుపులోకి తీసుకున్న యువకుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. బంగారం స్మగ్లింగ్ తెలిసిన వారెవరైనా అందుబాటులో ఉన్న కస్టమ్స్ ప్రివెంటివ్ టీమ్‌కు సమాచారం అందజేస్తే సీజ్ చేసిన సరుకు విలువలో 20 శాతం రివార్డు కింద అందజేస్తారన్నారు. కమిషనర్‌తో సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్య ఉన్నారు.