రాహుల్‌ దృష్టికి ఫుడ్‌పార్క్‌ పంచాయితీ | FOOD PARK ISSUE TO RAHUL GANDHI | Sakshi
Sakshi News home page

రాహుల్‌ దృష్టికి ఫుడ్‌పార్క్‌ పంచాయితీ

Jul 12 2017 11:26 PM | Updated on Oct 4 2018 5:10 PM

రాహుల్‌ దృష్టికి ఫుడ్‌పార్క్‌ పంచాయితీ - Sakshi

రాహుల్‌ దృష్టికి ఫుడ్‌పార్క్‌ పంచాయితీ

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జనావాసాల మధ్య భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ...

భీమవరం : ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా  జనావాసాల మధ్య భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారని పోరాట కమిటీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షేక్‌ అమర్‌జహాబేగ్‌ నేతృత్వంలో ఫుడ్‌పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జవ్వాది సత్యనారాయణ, సముద్రాల వేంకటేశ్వరరావు(అబ్బులు), కొయ్యే  మహేష్‌  బృందం రాహుల్‌ను కలసి ఫుడ్‌పార్క్‌ నిర్మాణం వల్ల ఏర్పడే ఇబ్బందులను వివరించారు. దీనిలో భాగంగా ఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి  యుపీఏ ప్రభుత్వ హయాంలోనే అనుమతులిచ్చారని ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఫుడ్‌పార్క్‌ నిర్మాణం నిలిపివేయకుంటే  ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వరి పంట, మత్స్యసంపద దెబ్బతిని ఉపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 40 గ్రామాలకు చెందిన రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడతామని వివరించారు. మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అండగా నిలుస్తూ పేదలను జైళ్లలో పెడుతున్నారని రాహుల్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన రాహుల్‌గాంధీ మాట్లాడుతూ   యూపీఏ ప్రభుత్వ హయాంలో  పారిశ్రామికాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఫుడ్‌పార్క్‌ల ఏర్పాటుకు రూ.2 వేల కోట్లు మంజూరు చేసిన విషయం వాస్తవమేనన్నారు. అయితే పారిశ్రామికాభివృద్ధి పేరుతో జనావాసాల మధ్య పరిశ్రమలు నిర్మించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. తుందుర్రు ఫుడ్‌పార్క్‌ సమస్యపై రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.  దీనికి ముందు పోరాట కమిటీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిగ్విజయ్‌షింగ్, టి.సుబ్బిరావిురెడ్డి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కేవీపీ రామచంద్రరావు తదితరులను కలసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement