పల్లె పాలనపై దృష్టి
గ్రామ పాలనను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటా అని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు.
- పలు సమస్యలకు గ్రామస్థాయిలోనే పరిష్కారం
- వచ్చే మూడు నెలలు పల్లె పర్యటనకు ప్రాధాన్యం
- మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దారుతో కూడిన బృందాలు
- జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): ‘ గ్రామస్థాయి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థను గాడిన పెడితే చాలా సమస్యలకు స్థానికంగానే పరిష్కారం దొరుకుతుంది. అందుకే వచ్చే మూడు నెలలు గ్రామాల పర్యటనకు ప్రాధాన్యం ఇస్తాను. గ్రామ పాలనను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటా’ అని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామ స్థాయిలోని వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఎవరి పని వాళ్లు చేస్తే ఎలాంటి సమస్యలుండవన్నారు. వచ్చే మూడు నెలలు గ్రామాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులు, గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను అధ్యయనం చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో ఐసీడీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యశాఖను కన్వర్జెన్సీ చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కన్వర్జెన్సీ చేయడం వల్ల గర్బిణీ స్త్రీలకు సకాలంలో టీకాలు వేయడం, వైద్య పరిక్షలు నిర్వహించడం సాధ్యమవుతుందని, అంగన్‌వాడీ సెంటరులో చేరిన చిన్నారులను బడిలో చేర్చే వీలుందని వివరించారు.
ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామస్థాయి పాలనపై పర్యవేక్షణ పెంచి ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేసే విధంగా చేసేందుకు మండల స్థాయిలో తహసీల్దారు, ఎంపీడీఓలతో రెండు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి టీములో అన్ని శాఖల అధికారులుంటారని తెలిపారు. ప్రతి నెలా ఒక డివిజన్‌ను ఎంపిక చేసుకుని ఎన్‌ఆర్‌జీఎస్ పనులు, తాగునీటి సమస్యలు, వైద్యసేవలు తదితర వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపారు. గృహ నిర్మాణాల్లో పురోగతి అతితక్కువగా ఉందని చెప్పిన కలెక్టర్.. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
మంగళవారం జిల్లాలో స్థాయిలో కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి నీటి సమస్య పరిష్కారం, ఉపాధి పనులకు లేబర్‌ను పెంచడం, విద్య, వైద్యం తదితర వాటిపై విధివిదానాలు స్పష్టం చేసి ప్రతి ఒక్కరినీ కార్యోన్ముఖులను చేస్తామన్నారు. గ్రామ, మండల స్థాయిలోనే చాలా వరకు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి పైసా జిల్లా అభివృద్ధి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాని తెలిపారు.