బీజేపీతో గొడవొద్దు | Dont fight with BJP | Sakshi
Sakshi News home page

బీజేపీతో గొడవొద్దు

May 16 2016 12:34 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీతో గొడవొద్దు - Sakshi

బీజేపీతో గొడవొద్దు

కేంద్రంతో గొడవ పడితే నష్టపోతామని, కాబట్టి కొంత తగ్గి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులకు సూచించారు.

♦ ఆ పార్టీపై ఎవరూ విమర్శలు చేయొద్దు
♦ ప్రధాని మోదీకి అన్నీ వివరిద్దాం: మంత్రులతో సీఎం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రంతో గొడవ పడితే నష్టపోతామని, కాబట్టి కొంత తగ్గి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులకు సూచించారు. ఈనెల 9న కుటుంబసభ్యులతో కలసి థాయిలాండ్, స్విట్జర్లాండ్ పర్యటనకెళ్లిన సీఎం శనివారం అర్ధరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాపై నెలకొన్న ఘటనల గురించి చర్చించారు. తాను విదేశీ పర్యటనలో ఉండగా చోటుచేసుకున్న పరిణామాల్ని తెలుసుకుని రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై మంత్రులకు సూచనలిచ్చారు.

బీజేపీ కోర్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్ధనాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. బీజేపీ సమావేశ విషయాల్ని ఆ పార్టీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ సీఎంకు పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. ప్రత్యేక హోదాపై బీజేపీని తప్పుపడుతూ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని, టీడీపీ వైఖరిని ఎండగట్టాలని సిద్ధార్ధనాథ్  ఆ పార్టీ నేతలకు సూచించడం, ఆయన ఇబ్బందికరంగా మాట్లాడిన విషయాల్ని సమావేశంలో విశ్లేషించిన ట్లు తెలిసింది. అయితే బీజేపీపై దూకుడు పెంచి ఎదురుదాడి చేయడానికి బదులుగా కొంత తగ్గి వెళితే మంచిదని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.  ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీని కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని కూలంకశంగా వివరించాలని సమావేశంలో నిర్ణయించారు.

 త్వరలో సమన్వయ కమిటీ సమావేశం
 బీజేపీ కోర్ కమిటీ నిర్ణయం మేరకు త్వరలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ దీనిపై సీఎం తో చర్చించారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్ధనాథ్‌సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు.

 కరువుపై సీఎం సమీక్ష
 రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సీఎం సమీక్షించినట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సోమవారం అన్ని శాఖలపైనా చంద్రబాబు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement