డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఐక్యవేదిక ఉపాధ్యాయ సంఘ నేతలు
టీచర్ల సామర్థ్యాలను పరిశీలించే టీఎన్‌ఐటీ (టీచర్స్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్) వద్దే వద్దని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు పేర్కొన్నారు. గురువారం డీఈవో కార్యాలయం ఎదుట వారు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
– డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ధర్నా
చిత్తూరు (ఎడ్యుకేషన్) : టీచర్ల సామర్థ్యాలను పరిశీలించే టీఎన్‌ఐటీ (టీచర్స్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్) వద్దే వద్దని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు పేర్కొన్నారు. గురువారం డీఈవో కార్యాలయం ఎదుట వారు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. టీఎన్‌ఐటీని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఉపాధ్యాయులెవరూ సుముఖత చూపడం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి టీచర్లను ఆందోళనలకు గురి చేయడం సబబు కాదన్నారు. పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి కొత్త కొత్త వింత విధానాలను ప్రవేశపెట్టడం పద్ధతి కాదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను సాధించి ఎంఈవో, డీవైఈవో, డైట్ లెక్చరర్ల పోస్టుల భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పీఆర్‌సీ బకాయిల జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గత వేసవి సెలవుల్లో పనిచేసిన టీచర్లకు కరువుభత్యం ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పలువురు టీచర్లు బదిలీలు పొందినప్పటికీ వారిని రాష్ట్ర విద్యాశాఖ రిలీవ్ చేయకపోవడం అన్యాయమని, వారిని వెంటనే బదిలీ అయిన స్థానాలకు పంపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనలో పూర్తి స్వేచ్చను ఇచ్చినప్పుడే సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు నరోత్తమరెడ్డి, గిరిప్రసాద్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సహదేవనాయుడు, పోతంశెట్టి రమేష్, సోమశేఖర్‌నాయుడు, గుణశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్ నాయుడు, శ్రీరామమూర్తి, విశ్వనాథరెడ్డి, నరేంద్ర, చెంగల్రాయమందడి, మధు, నరేష్, జ్ఞానశేఖర్, ఆంజినేయులు, సుబ్రమణ్యం, తులసీరామ్, ఎహెసనుల్లా తదితరులు పాల్గొన్నారు.