బాబూరావు బాగోతాలు చూడతరమా..!

బాబూరావు బాగోతాలు చూడతరమా..!


సాక్షి, గుంటూరు: సీనియర్ విద్యార్థులతో మద్యం సేవించడం, విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్న సీనియర్లకు అండగా నిలవడం, తనమాట వినకపోయినా, తనపై ఫిర్యాదు చేసినా, వారికి మార్కులు తగ్గించడం, అదేమని ప్రశ్నించిన అధ్యాపకులను సైతం తన అధికారంతో తొలగించడం.. ఇదీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు బాబూరావు వ్యవహార శైలి.



2009లో యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రారంభించగానే నిబంధనలకు విరుద్ధంగా బాబూరావును ప్రిన్సిపాల్‌గా నియమించారు. అంతకుముందు ఆయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎస్‌ఏఆర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. అక్కడ సైతం మహిళా అధ్యాపకులు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిండం, మాటవినని విద్యార్థులకు మార్కులు తగ్గించడం వంటివి చేసేవారని అక్కడి వారు చెబుతున్నారు.



బాబూరావు వ్యవహార శైలి తెలుసుకున్న యాజమాన్యం ఆయన్ని విధుల నుంచి తొలగించింది. ఇవన్నీ తెలుసుకోకుండానే నాగార్జున యూనివర్సిటీ అధికారులు ఆయన్ని ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఈ నియామకంపై విమర్శలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడకు వచ్చాకకూడా బాబూరావు అకృత్యాలు తగ్గలేదు. అధ్యాపకులు, విద్యార్థులు అనేకసార్లు ఫిర్యాదుు చేసినా యూనివర్సిటీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోలేదు. గతనెల 14న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో బాబూరావు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.



కళాశాల బయట హాయ్‌ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ నిర్వహించడం.. అందులో మందు పార్టీలు జరపడం.. వంటివి చేయడంతోపాటు, ప్రిన్సిపాల్ పేరుతో ఉన్న మద్యం బిల్లును సైతం ఆధారాలతో సహా ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీకి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కొందరు విద్యార్థులు, అధ్యాపకులు అందజేసిన విషయం తెలిసిందే.



రిషితేశ్వరి కేసులో విచారణ నిర్వహించిన రెండు కమిటీలూ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడేలా ప్రిన్సిపాల్ బాబూరావు అండదండలు అందించారని నిర్ధారించారు కూడా. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంగానీ, ఆయన్ని అరెస్ట్ చేసి విచారించడంగానీ చేయకపోవడంపై విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top