
ఆయకట్టుపై.. అదే మాట !
'హంద్రీ-నీవా నీటిని చిత్తూరు, కుప్పానికి తీసుకెళ్లేందుకే ఆయకట్టుకు ఇవ్వడం లేదని కొన్ని పత్రికలు విమర్శిస్తున్నాయి.
– హంద్రీ-నీవా నీరు కుప్పానికి తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు ఇచ్చేది లేదని సీఎం పునరుద్ఘాటన
– వేరుశనగకు హెక్టారుకు రూ.15వేల చొప్పున ఇన్సూరెన్స్ లేదా ఇన్‌పుట్ సబ్సిడీ
– శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పనులపై విచారణ
–దెబ్బతిన్న 13.5 కిలోమీటర్ల పైపులైన్ పనులకు రూ.30 కోట్లు
– గొల్లపల్లిలో పర్యాటకాభివృద్ధి
- వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
– జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– గంగపూజ చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
'హంద్రీ-నీవా నీటిని చిత్తూరు, కుప్పానికి తీసుకెళ్లేందుకే ఆయకట్టుకు ఇవ్వడం లేదని కొన్ని పత్రికలు విమర్శిస్తున్నాయి. మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు, మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లివ్వాలి. చిత్తూరు జిల్లాలో అడవిపల్లి, చిత్తూరు, కుప్పానికి తీసుకెళ్లాలి. చెరువులు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్‌లు నింపాల'ని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆయకట్టుకు నీరిస్తామని మాత్రం చెప్పలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే కళ్లెదుటే నీళ్లున్నా మరికొన్నేళ్ల పాటు ఆయకట్టుకు అందే అవకాశం లేదని స్పష్టమైంది. సీఎం చంద్రబాబు శుక్రవారం పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు.
ఆయన మధ్యాహ్నం రిజర్వాయర్‌కు చేరుకున్నారు. పైభాగంలో మూడురోజుల కిందట కొద్దిగా లిఫ్ట్‌చేసి నిల్వ ఉంచిన నీటికి గంగపూజ చేసి రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరించారు. రిజర్వాయర్‌కు ‘ఎన్‌టీఆర్ జలాశయం’ అని నామకరణం చేశారు. తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. ఆపై మడకశిరలో పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడి నిధి కింద జిల్లా సమాఖ్యకు రూ.197.64 కోట్లు, బ్యాంక్ లీకేజీ కింద రూ.306 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ రెండు సభల్లోనూ ముఖ్యమంత్రి ప్రసంగఽం ఇలా సాగింది.
భూగర్భజలాలు పెంచుతాం
‘జీడిపల్లికి నీళ్లొచ్చాయి. ఇప్పుడు గొల్లపల్లికి ఇచ్చాం. 1.6 టీఎంసీలు ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు. తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం గొల్లపల్లిలో మరో రిజర్వాయర్ నిర్మించే ఆలోచన చేస్తున్నాం. ఇక్కడి నుంచి చెరువులు, చెక్‌డ్యాంలు నింపి భూగర్భజలాలు పెంచుతాం. మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు, ఈ ఏడాదిలోనే చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లకు నీళ్లిస్తాం. జీడిపల్లి, గొల్లపల్లి, పీఏబీఆర్, ఎంపీఆర్, చిత్రావతి రిజర్వాయర్లను నింపి భూగర్భజలాలు పెంచుతాం. దీంతో శాశ్వతంగా కరువు నివారిస్తాం. ఇప్పటి వరకూ 20 టీఎంసీల కృష్ణాజలాలు జిల్లాకు చేరాయి. వేసవిలో మంచినీటి సమస్య రాకుండా ఉండేందుకు మరో 13 టీఎంసీలు కావాలి. దీని కోసం ప్రధాన కాలువను వెడల్పు చేయాలి. దీని కోసం అంచనాలు సిద్ధం చేశాం. గొల్లపల్లిలో టూరిజం గెస్ట్‌హౌస్, మ్యూజియం నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. హైవే నుంచి రిజర్వాయర్‌కు రోడ్డు కూడా నిర్మిస్తాం. అయితే.. రైతులు వారి పొలాలను ల్యాండ్‌పూలింగ్ ద్వారా ఉచితంగా ఇవ్వాలి.
హెక్టారుకు రూ.15 వేల పరిహారం
రెయిన్‌గన్‌లతో వేరుశనగకు నీళ్లిచ్చాం. అయితే దిగుబడిని కాపాడలేకపోయాం. దీంతో ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా హెక్టారుకు రూ.15వేల పరిహారం అందిస్తాం. అలాగే జిల్లాలో రూ.7,200 కోట్లతో 25 పరిశ్రమలఽ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
శ్రీరామరెడ్డి పథకంపై విచారణ
శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పనులు నాసిరకంగా చేశారు. 13.5 కిలోమీటర్ల మేర నాసిరకం పైపులైన్లు వేశారు. దీంతో 895 గ్రామాలకు నీరివ్వాల్సి ఉంటే.. 300 గ్రామాలకే ఇస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నా. బాధ్యులుగా తేలిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. పైపులైన్ కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నాం. మార్చిలోపు పనులు పూర్తి చేయాలి. అలాగే పశువులకు గడ్డి కొరత లేకుండా ఇంటింటికి దాణా పంపిణీ చేస్తామ’ని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా జేసీనాగిరెడ్డి, సీబీఆర్‌తో పాటు మంచినీటి పథకాల మరమ్మతులను మార్చిలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లురవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, మేయర్ స్వరూప, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, బాలకృష్ణ, వరదాపురం సూరి, జితేంద్రగౌడ్, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.