బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా తీసుకొచ్చిన మార్పుచేర్పులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివరించనున్నారు
సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా తీసుకొచ్చిన మార్పుచేర్పులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివరించనున్నారు. పథకాలు, వాటి కేటాయిం పులు, కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలపై బుధవారం అసెంబ్లీలో, మండలిలో తెలియజేయనున్నారు. మంగళవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమం, హౌసింగ్ తదితర శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్‌వోడీలతో ఆయన భేటీ అయ్యారు.
ఆయా శాఖలకు 2013-14, 14-15, 15-16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కేటాయించిన బడ్జెట్, ఖర్చు చేసిన నిధులు, బడుగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను గురించి అధికారులు నివేదికలు రూపొందించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ, గృహ నిర్మాణ శాఖల అధికారులు సమావేశమై వివరాలను క్రోడీకరించారు. ఆయాశాఖల బడ్జెట్ ఎంత మేరకు పెరిగిందన్న అంశాలను ఉటంకిస్తూ సీఎం ప్రసంగించనున్నట్లు సమాచారం.