క్లస్టర్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం | Cluster ambiguous transfers of employees | Sakshi
Sakshi News home page

క్లస్టర్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం

Jun 16 2016 9:03 AM | Updated on Sep 4 2017 2:33 AM

క్లస్టర్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం

క్లస్టర్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం

వైద్య ఆరోగ్యశాఖలో అంతర్భాగమైన క్లస్టర్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

త్వరలోనే వ్యవస్థను రద్దుచేస్తామన్న మంత్రి
రద్దుచేయక.. పోస్టులు కనిపించక
అగమ్యగోచరంలో క్లస్టర్ పరిధిలోని సిబ్బంది

సాక్షి, కడప : వైద్య ఆరోగ్యశాఖలో అంతర్భాగమైన క్లస్టర్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న క్లస్టర్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రద్దు జరగని పరిస్థితుల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత క్లస్టర్లను రద్దు చేస్తే ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎక్కడ పోస్టింగ్ కల్పిస్తారన్న దానిపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై అటు ప్రభుత్వంగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది.

 పోస్టుల పరిస్థితి ఏంటి?
ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 14వ తేదీలోపు చాలామంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఐదేళ్లు కాలపరిమితి పూర్తిచేసుకున్న వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కూడా కిందిస్థాయి నుంచి ఉన్నత యంత్రాంగం వరకు ఖాళీల వివరాలను గుర్తించడంతోపాటు కలెక్టర్‌కు ఫైలు పంపి తెలియజేశారు. ఇక బదిలీలే తరువాయి.. ఇలాంటి పరిస్థితుల్లో బదిలీల ప్రక్రియ ముగిస్తే.. జిల్లాలో ఎక్కడా ఖాళీలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో క్లస్టర్లను రద్దుచేస్తే వారి పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నెలకొంది. ఖాళీలు లేనప్పుడు క్లస్టర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎక్కడ నియమిస్తారన్నది కూడా వారిని తొలిచివేస్తోంది.

 ఇప్పుడే రద్దుచేసి ఉంటే..
జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో దాదాపు 14 క్లస్టర్లు నడుస్తున్నాయి. వీటికి డెప్యూటీ డీఎంహెచ్‌ఓ స్థాయి అధికారులు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయితే వీటిని రద్దుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే ఉద్యోగులకు వెసులుబాటు ఉండేది. వారు కూడా ఖాళీలను బట్టి స్థానాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది.

 వైద్య ఆరోగ్యశాఖలో మూడేళ్లుగా కనిపించని బదిలీలు
అంతకుముందు కిరణ్ సర్కార్ ఆధ్వర్యంలో, తర్వాత రెండేళ్ల టీడీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో చాలామంది ఉద్యోగులు బదిలీలకు నోచుకోలేదు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పట్ల పెద్దగా ఆసక్తిచూపలేదు. తాజా బదిలీల నేపథ్యంలో ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే 20 శాతంలోపు మాత్రమే ఉద్యోగులను బదిలీ చేయాలని నిబంధన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

క్లస్టర్లపై పురోగతి లేదు : డీఎంహెచ్‌ఓ
క్లస్టర్లను ప్రభుత్వం రద్దు చేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏమిటని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యనారాయణరాజును ‘సాక్షి’ వివరణ కోరగా క్లస్టర్లకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రత్యేకంగా దీనిపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని వివరించారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement