
అమ్మాయి పెళ్లికెందుకు తొందర..
బాలిక పెళ్లికి ఎందుకు తొందర.. ముందు ఉన్నత చదువులు చదివించండి
ఘనపూర్‌లో బాల్య వివాహం నిలిపివేత
కుల్కచర్ల: బాలిక పెళ్లికి ఎందుకు తొందర.. ముందు ఉన్నత చదువులు చదివించండి అని అధికారులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులకు కౌన్సెలింగ్ నిర్వహించి పెళ్లి ఏర్పాట్లను నిలిపివేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఘనపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రవీందర్‌గౌడ్ కూతురు (13) కుల్కచర్ల బాలికల ఉన్నత పాఠశాలలో 7 వ తరగతి చదువుతుంది. వారం రోజుల క్రితం ఆమె పరీక్షలు రాసింది. ఆమెకు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన తమ బంధువులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబీకులు నిశ్చయించారు.
బుధవారం పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఏర్పాట్లు చేశారు. బాలిక కుటుంబీకులు సోమవారం పెళ్లి పందిరి వేశారు. బాల్య వివాహ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి, ఆర్‌ఐ యాదయ్య, పోలీసులు గ్రామానికి చేరుకొని పెళ్లి ఏర్పాట్లు అడ్డుకున్నారు. బాలికకు మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే కలిగే నష్టాలను వివరించారు. బాలిక మేజర్ అయ్యాకే పెళ్లి చేయాలని కౌన్సెలింగ్ చేశారు. ముందు బాలికను ఉన్నత చదువులు చదివించండి అని సూచించారు. కాదు కూడదని పెళ్లి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బాలిక తల్లిదండ్రుల నుంచి హామీ పత్రం రాయించుకున్నారు.
సబ్ కలెక్టర్ కౌన్సెలింగ్
వికారాబాద్ రూరల్:బాలికకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఆమె తల్లిదండ్రులకు సబ్ కలెక్టర్ సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలు.. మండల పరిధిలోని మద్గుల్‌చిట్టంపల్లి గ్రామానికి చెందిన మంగలి సత్యమ్మ కూతురు(12)కు వివాహం చేసేందుకు సోమవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలిక కుటుంబీకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తహసీల్దార్ గౌతంకుమార్ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ శృతిఓజా ఎదుట హాజరుపరిచారు. బాలికను బాగా చదివించాలని సబ్ కలెక్టర్ వారికి సూచించారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్ధిరపడాలని మైనారిటీ తీరేవరకు వివాహం చేసుకోవద్దని సబ్‌కలెక్టర్ బాలికకు సూచించారు. అనంతరం బాలికను అధికారులు హోంకు తరలించారు.