
'బాబు..మీ అనుచరులతో ఆటలు ఆపండి'
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం నుంచి తన భార్యతో కలిసి ఆమరణ దీక్ష చేయనున్నట్లు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు.
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...దీక్షా శిబిరం వద్దకు ఎవరూ రావొవద్దని సూచించారు. దీక్షకు మద్దతుగా కాపులంతా ఇళ్లవద్ద ఉండి తనకు మద్దతు తెలపాలని ముద్రగడ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం భోజనం మానేయాలని, పళ్లెంపై గరిటెతో కొడుతూ నిరసన తెలపాలన్నారు.
కాపు జాతికి అంబేద్కర్, సంజీవయ్య ఎంతో న్యాయం చేశారని, బీసీల్లో చేర్చే జీవోను తీసుకువచ్చి న్యాయం చేశారని అన్నారు. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని ముద్రగడ మరోసారి స్పష్టం చేశారు. తనపై టెర్రరిస్ట్ చట్టాల కేసులు నమోదు చేసినా భయపడేది లేదన్నారు.
తప్పుడు ప్రచారం వల్లే తన గన్ను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. చంద్రబాబు తన అనుచరులతో చేయిస్తున్న ఆటలు ఆపాలని ముద్రగడ హెచ్చరించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. తాను, తన భార్య కాపు ఉద్యమానికి అంకితమని ముద్రగడ తెలిపారు.