కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా
దాచేపల్లి : విజయవాడ కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. దాచేపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్ మనీ కేసులో తవ్విన కొద్ది అధికారపార్టీ నాయకుల ఆగడాలు, అక్రమాలు, దందాలు బయటపడుతున్నాయని, కేసు నుంచి వారిని తప్పించేందుకు భారీ కుట్ర జరుగుతోందని జంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అధికార పార్టీ నాయకుల అండదండలతోనే పోలీసులు పిడుగురాళ్ల మండలానికి చెందిన తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని, ఈ విధమైన విష సంృ్కతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్యం పుణ్యం తెలియని తమ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టటం దారుణమని, దీనిపై ఆందోళన చేపడతామని తెలిపారు. సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.