అక్షర యోధునికి ‘అనంత’ అశ్రునివాళి | c.narayanareddy dies of unhealthy | Sakshi
Sakshi News home page

అక్షర యోధునికి ‘అనంత’ అశ్రునివాళి

Jun 12 2017 11:39 PM | Updated on Sep 5 2017 1:26 PM

అక్షర యోధునికి ‘అనంత’ అశ్రునివాళి

అక్షర యోధునికి ‘అనంత’ అశ్రునివాళి

అక్షరాలకు నడకలు నేర్పుతూ.. కవిగా అత్యంత ప్రతిష్టాత్మాక జ్ఞానపీఠ అవార్డును దక్కించుకున్న సరస్వతీ పుత్రుడు డాక్టర్‌ సి. నారాయణరెడ్డికు ‘అనంత’ సాహితీ లోకం అశ్రునివాళులర్పించింది.

అనంతపురం కల్చరల్‌ : అక్షరాలకు నడకలు నేర్పుతూ..  కవిగా అత్యంత ప్రతిష్టాత్మాక జ్ఞానపీఠ అవార్డును దక్కించుకున్న సరస్వతీ పుత్రుడు డాక్టర్‌ సి. నారాయణరెడ్డికు ‘అనంత’ సాహితీ లోకం అశ్రునివాళులర్పించింది. సినారెగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన నారాయణరెడ్డికు జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. 1994లో జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ కళాశాల వేదికగా ప్రారంభమైన ‘బ్రహ్మశ్రీ కల్లూరు వేంకటనారాయణరావు కళానికేతన్‌’ కళాభవనాన్ని సినారె ప్రారంభించారు. అనంత కళాపీఠం వ్యవస్థాపకులు ఆంజనేయులు గౌడ్, జనప్రియ కవి ఏలూరు ఎంగన్న స్వయంగా ఆయనతో పాటు అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానించి నగరంలో అప్పట్లో సాహితీ సభ నిర్వహించారు.

అనంతరం లలితకళాపరిషత్తులో సినారెను అనంత కవులు, కళాకారులు ఘనంగా సత్కరించారు. కవిత్వవేది బిరుదాంకితులైన జిల్లా వాసి కల్లూరు వేంకటనారాయణరావు రచించిన ‘శ్రీమదశోక చరిత్రము’ కావ్యం తాను ఎంఏ చదివేరోజుల్లో ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండేదంటూ ఆ రోజుల్లో సినారె పేర్కొన్నారు. అనంత కవులు ఎవరికి తీసిపోని ఘనాపాటీలని నాటి సభలో సినారె ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతర కాలంలో కూడా రాష్ట్రస్థాయిలో పలు వేదికలపై సాగిన సాహితీసభల్లో సినారె అనంత వాసులతో ప్రత్యేకంగా చర్చలు సాగించిన సందర్భాలెన్నో ఉన్నాయని ఎంగన్న కవి గుర్తు చేసుకున్నారు.

సినారె మృతికి సంతాపం
సోమవారం ఉదయం సినారె మృతి వార్త వినగానే పలు సాహితీ, కళా సంస్థలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాయి. డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి జిల్లా నిర్వాహకులు రియాజుద్దీన్, చింతా వెంకటేశ్వర్లు, రఘురామయ్య, ద్విభాషా కవి జూటూరు షరీఫ్, ఎల్‌ఆర్‌ వెంకటరమణ తదితరులు సంతాపం తెలిపారు. తెలుగు భాషా వికాస ఉద్యమ సారధులు జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, దాసరి హరిశ్చంద్రరామ, సాహితీ స్రవంతి నిర్వాహకులు పిళ్లా కుమారస్వామి, రవిచంద్ర, విశాలాంధ్ర మేనేజర్‌ చెట్ల ఈరన్న సంతాప సభలు నిర్వహించి సినారె విశిష్టతను గుర్తుకు చేసుకున్నారు. ప్రసిద్ధ కథా రచయితలు డాక్టర్‌ శాంతినారాయణ, సింగమనేని నారాయణ, మధుర కవి మల్లెల నరసింహ మూర్తి, నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్, పద్మనాభరెడ్డి, లలితకళాపరిషత్తు అధ్యక్ష, కార్యదర్శులు మేడా సుబ్రహ్మణ్యం, నారాయణస్వామి, రాము తదితరులు సినారె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సాహితీ సేవలు చిరస్మరణీయమని, సాహితీలోకానికి తీరని లోటన్నారు.

సినారె సాహితీ సేవలు చిరస్మరణీయం
ప్రఖ్యాత కవి సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత,, కలెక్టర్‌ వీర పాండియన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినారె మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యామని, తెలుగు భాషా వికాసానికి సినారె అనన్యమైన సేవలందించారని వారు కొనియాడారు. అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కవి నానీల నాగేంద్ర ప్రగాఢ సంతాపం తెలిపారు. అజరామర సేవలతో సినారె చేసిన సాహితీ కృషి ప్రతి తెలుగు వాడి హృదయంలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement