బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు
జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
బోయకొండ(చౌడేపల్లె): జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు,లక్ష్మణాచార్యులు,గంగిరెడ్డి, సుధాకర్ ఆధ్వర్యంలో అభిషేకం అనంతరం పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో బాలా త్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ చైర్మన్ గువ్వల రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకట్రమణరాజు, ఈవో ఏకాంబరం, పాలకమండలి సభ్యులు సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలను అందజేశారు. వేదపండితులు గోవర్ధనశర్మ, లక్ష్మణాచార్యులు ఆధ్వర్యంలో గణపతి పూజ, స్వస్తివాచనం, దేవనాంది గణపతిహోమం, చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
రూ.3,516 చెల్లించి ఉభయదారులుగా చేరండి..
ఆలయంలో దసరా మహోత్సవాల్లో రూ.3,516 చెల్లించి భక్తులు ఉభయదారులుగా పాల్గొనవచ్చని ఈవో ఏకాంబరం తెలిపారు. ఊంజల్‌సేవ, అభిషేకం, గణపతిహోమం, చండీ హోమంలో పాల్గొనవచ్చని, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, రవికపీసు, కుంకుము, గాజులు,అమ్మవారి చిత్రపటం దేవస్థానం తరపున ఇస్తామని చెప్పారు. ఉభయదారుల పేర్ల నమోదుకోసం 08581–254766 నంబరును సంప్రదించాలని కోరారు.
నేడు ధనలక్ష్మి అలంకారం..
దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం అమ్మవారు «ధనలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.