
అదరగొట్టిన సల్లూబాయ్.. సానియా
సానియా చెల్లి ఆనమ్ మీర్జా వివాహ వేడుకలో అదరగొట్టే స్టెప్పులు వేసిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్
‘బేబీకో బేస్ పసంద్ హై...’ అంటూ సల్మాన్ ఖాన్ చిందేస్తుంటే... అనుష్కశర్మ అతనికి పోటీగా అడుగులు కదపడం ‘సుల్తాన్’ సినిమాలో చూస్తాం. అయితే అదే పాటకి సల్మాన్ కి తోడుగా టెన్నిస్ స్టార్ సానియా స్టెప్స్ వేయడం చూడగలమా? సిటీకి చెందిన కొందరికి మాత్రం ఆ అదృష్టం దక్కింది. మన టెన్నిస్ సంచలనం తన సోదరి ఆనమ్ మీర్జా వివాహ వేడుకలో స్టెప్స్ వేసి టెన్నిస్ రాకెట్‌తోనే కాదు డ్యాన్సులతోనూ మెరపించగలనని నిరూపించారు. గోల్కొండ రిసార్ట్స్ వేదికగా బుధవారం జరిగిన ఈ సంగీత్ విశేషాల గురించి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ట్విస్ట్ అండ్ టర్న్ సంస్థ కొరియోగ్రాఫర్ ఆర్యన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
‘ఏడేళ్లుగా సానియా కుటుంబంతో పరిచయం ఉంది. పెళ్లికి ముందే నా స్నేహితుల ద్వారా ఆమె నాకు పరిచయం. చాలా మంది సెలబ్రిటీలతో పోలిస్తే సానియా బాగా డౌన్ టు ఎర్త్. ఒకప్పుడు అసలు వరల్డ్ చాంపియన్ తో మాట్లాడడమే గొప్ప అనుకున్నాం. అయితే ఆమె మాతో పక్కింటి అమ్మాయిలా ఉండడం మరింత ఆశ్చర్యం. సానియా, ఆనమ్‌మీర్జా ఇద్దరి పెళ్లి సంగీత్‌లకు కొరియోగ్రఫీ అందివ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. సానియా చాలా పెద్ద స్టార్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఓ గొప్ప ఫ్యామిలీ పర్సన్ అని సన్నిహితంగా మెలిగే వాళ్లకు మాత్రమే తెలుసు. ఇక ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరి గురించి ఒకరు అన్నట్టుంటారు. ఈ పెళ్లికి మొత్తం సానియానే పెద్దయ్యారు. చెల్లెలి కోసం సానియా స్వయంగా శ్రమపడి ఎన్నో రెడీ చేశారు.
థీమ్స్ అండ్ డ్యాన్స్..
ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఈ సంగీత్‌ను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దాం. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ థీమ్, బాలీవుడ్ థీమ్, కపిల్‌శర్మ షో... వంటివి ఈ ఈవెంట్‌కి హైలెట్. థీమ్స్‌లోనూ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌ను తొలిసారిగా ఈ సంగీత్ కోసం కలగలిపాం. సుల్తాన్ లోని ‘బేబీ కో బేస్ పసంద్ హై’ పాటకు సానియా, షోయబ్‌ల డ్యాన్స్ , వీరితో కలిసి సల్మాన్ ఖాన్, పరిణితి చోప్రాలు సైతం అడుగులు కదపడం వంటి ఆకర్షణలెన్నో యాడ్ అయ్యాయి. సెలబ్రిటీ సంగీత్‌తో పాటు బంధువులు, సన్నిహితుల కోసం మరో ప్రత్యేక సంగీత్‌ను కూడా నిర్వహించాం.