దిగిరాని బొజ్జల | Sakshi
Sakshi News home page

దిగిరాని బొజ్జల

Published Wed, Apr 5 2017 2:08 AM

దిగిరాని బొజ్జల - Sakshi

ఫలించని బుజ్జగింపులు
తగ్గేదిలేదంటున్న మాజీ అమాత్యులు
దేవస్థానం చైర్మన్‌  చర్చలు.....
శ్రీకాళహస్తి వచ్చాక తుది నిర్ణయం


శ్రీకాళహస్తి: మాజీ మంత్రి,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణారెడ్డి వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. వెనక్కి తగ్గేది లేదని రాయబారాలకు వచ్చిన వారికి సమాధానమిస్తున్నట్లు తెలిసింది.  సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు,ఎంపీ సీఎం రమేష్‌ బుజ్జగింపులు ఫలించలేదు. మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడంపై మాజీ మంత్రితో పాటు ఆయన అనుచర వర్గమంతా రగిలిపోతోంది. ఇది తమకు తీరని అవమానమని భావిస్తోంది. మంత్రి వర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాలపాటు టీడీపీకి ఎంతో కృషిచేసినా తమను అగౌరవపరిచేలా మంత్రి పదవి నుంచి తొలగించారని, అందుకే ఆయన కలత చెందారని బొజ్జల సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ  తీసుకున్న నిర్ణయం దారుణమని అనుచరులవద్ద వాపోతున్నారని  శ్రీకాళహస్తిలో ప్రచారం సాగుతుంది.

కీలక సమయాలలో వెన్నుదన్నుగా నిలిచిన తననిలా అవమానించి పంపడం సబబా అని ఆయన అధిష్టాన పెద్దలను ప్రశ్నిస్తున్నట్లు భోగట్టా. రాజీనామా విషయంలో ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని అనుచరులతో తేల్చిచెప్పినట్లు చర్చసాగుతుంది. మరో రెండు రోజుల్లో బొజ్జల శ్రీకాళహస్తికి రానున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చలు జరిపి తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

మరోవైపు  మంగళవారం శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు, తొట్టంబేడు మండలం పార్టీ అధ్యక్షుడు గాలి మురళీనాయుడుతోపాటు ముఖ్యనేతలు ప్రభాకర్‌నాయుడు, భాస్కర్‌నాయుడు, చంద్రారెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, చిరంజీవుల నాయుడు హైదరాబాద్‌ వెళ్లారు.  పార్టీ అంశాలపై బొజ్జలతో వారు చర్చించినట్లు తెలుస్తుంది. మున్సిపల్‌ చైర్మన్‌ పేట రాధారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్న విషయాలు చర్చించినట్లు సమాచారం.

Advertisement
Advertisement