‘పోలో’మంటూ..

‘పోలో’మంటూ..


పోలో.. ఆట గురించి తెలుసు కదా? గుర్రాల మీద దౌడుతీస్తూ... పొడవాటి కర్రతో బంతిని గోల్లోకి నెట్టే క్రీడ. చూడ్డానికి ఉత్కంఠ భరింతగా.. గుర్రాలతో తలపడే తీరు పాతకాలం నాటి యుద్ధా సన్నివేశాలను తలపిస్తోంది. ఇంచుమించు అటువంటి క్రీడే... సైకిల్‌ (బైస్కిల్‌) పోలో. గతం నుంచీ ఉన్న సంప్రదాయ క్రీడేనైనా.. ఇప్పుడిప్పుడే  తూర్పుగోదావరి జిల్లాలో ‘పోలో’మంటూ దీనికి ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌)లో దీనిని చేర్చడంతో మరింత ఆదరణ పెరిగే అవకాశముంది.



సాక్షి, అమలాపురం: ఒక్కో జట్టు తరఫున నలుగురు మాత్రమే క్రీడాకారులు మైదానంలో ఆడాల్సి ఉంది. మరో ఇద్దరు, నలుగురు అదనపు క్రీడాకారులుంటారు. ఎవరు ఎక్కువగా గోల్స్‌ చేస్తే వారే గెలిచినట్టు. మొత్తం 30 నిమిషాల పాటు రెండు జట్ల మధ్య పోటీ సాగుతుంది. నాలుగు క్వార్టర్లుగా (క్వార్టర్‌ 7.30 నిమిషాలు) చేసి ఆడిస్తారు. ఈ ఆటలో ప్రత్యేకంగా గోల్‌కీపర్‌ అంటూ ఉండడు. ఏ క్రీడాకారుడైనా గోల్‌ చేయడం, అడ్డుకోవడం చేయవచ్చు. కాని బాల్‌ను బ్యాట్‌తో టచ్‌ చేసేటప్పుడు మాత్రం కాలు భూమిమీద పెట్ట కూడదు. అలా చేస్తే ఫౌల్‌గా పరిగణిస్తారు. క్రీడా మైదానం 100 మీటర్లు పొడవు, 80 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ గేమ్‌కు వినియోగించే సైకిల్‌కు ముందు బ్రేక్, మధ్యలో మడ్‌ఘర్‌ ఉండదు. బ్యాట్‌ ఇంచుమించు సుత్తిలా ఉంటుంది. పట్టుకునే కర్ర మాత్రం పొడవుగా ఉంటుంది.



ప్రపంచ పోటీల్లో మన దేశం హవా

ఇంటర్నేషనల్‌ బైస్కిల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో మన దేశ జట్టు పలు సందర్భాల్లో సత్తా చాటింది. 1996లో యూఎస్‌ఏలో రిచ్‌ల్యాండ్, 1999లో కెనడా, 2000లో మన దేశంలో న్యూఢిల్లీలో, 2001లో బ్రిటన్‌లోని లండన్‌లో మనదేశం విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించింది. 2002లో ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో, 2004లో కెనడాలో జరిగి పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచి రజపతకాలు కైవసం చేసుకుంది.



పెరుగుతున్న ఆదరణ

సైకిల్‌ పోలోకు మన జిల్లాలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. కాకినాడ, పిఠాపురం, మామిడికుదురు కేంద్రాలుగా ఈ క్రీడ వృద్ధి చెందుతోంది. గత ఏడాది నుంచి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) అండర్‌ –19 విభాగంలో సైకిల్‌ పోలోకు అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. గత ఏడాది కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఎస్‌జేఎఫ్‌–17 రాష్ట్రస్థాయి పోటీల్లో బాలురు మూడో స్థానం, బాలికలు రెండో స్థానం పొందారు. జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో జేహెచ్‌ఎస్‌ అరుణ్‌తేజ్, వి.యశస్వీ, యు.అంబికా, స్వర్ణలేఖలు జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఛతీస్‌ఘడ్‌ రాష్ట్రం బిలాయిలో జరిగిన జాతీయ పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించారు. వీరి ఎంపిక మరికొంత మంది క్రీడాకారులకు ఉత్తేజాన్నిస్తోంది. అక్కడ కూడా మన రాష్ట్ర బాలికల జట్టు రెండవ స్థానంలో, బాలుర జట్టు మూడవ స్థానంలో నలిచింది. రాజోలు ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ, పిఠాపురానికి చెందిన యోగాకోచ్‌ పల్ల లక్ష్మీణరావులు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం చత్తీస్‌ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఇండియన్‌ ఆర్మీ, రాజస్థాన్‌ జట్లు ముందంజలో ఉన్నాయి. 




ప్రభుత్వం ప్రోత్సహించాలి 

ఇటువంటి క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో క్రీడామైదానాలు, సైకిళ్లను ఏర్పాటు చేయాలి. మన క్రీడాకారులు సాధారణ సైకిళ్లపై శిక్షణ పొందుతున్నారు. వీరు అంతర్జాతీయ పోటీలకు వెళితే ఆ స్థాయిలో రాణించలేరు. – జొన్నాలగడ్డ గోపాలకృష్ణ, ఎంఈవో, కోచ్, రాజోలు



జాతీయస్థాయిలో ఆడడం ఆనందంగా ఉంది

తొలి ప్రయత్నంలో నేను రాష్ట్ర జట్టుకు ఎంపికకావడం ఆనందంగా ఉంది. మాకు స్థానికంగా మంచి శిక్షణ ఇచ్చారు. జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ పోటీల్లో రాణించాలన్నదే నా ఆశ. – జె.హెచ్‌.ఎస్‌.అరుణ్‌తేజ్, సైకిల్‌పోలో క్రీడాకారుడు 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top