
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
ముదిగుబ్బ మండలం దొరిగల్లు సమీపంలో సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలం దిగువపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణస్వామి(32) మరణించినట్లు ఎస్‌ఐ మగ్బుల్‌బాషా మంగళవారం తెలిపారు.
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండలం దొరిగల్లు సమీపంలో సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలం దిగువపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణస్వామి(32) మరణించినట్లు ఎస్‌ఐ మగ్బుల్‌బాషా మంగళవారం తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండలం దిగువపల్లికి చెందిన వెంకటనారాయణరెడ్డి అనే రైతు ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తన వేరుశనగ కాయలను ముదిగుబ్బ మండలం ఎగువపల్లి పరిసర గ్రామాల్లో కొనుగోలు చేసి ఆటోలో స్వగ్రామానికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో దొరిగల్లు వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు తెలిపారు. ఘటనలో ఆటో డ్రైవర్ నారాయణస్వామికి తీవ్ర గాయాలు కాగా, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమార్తెలు జాష్ణవి, వైష్ణవి, కుమారుడు చరణ్‌కుమార్ ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లలు విలపించడం చూసి అందరి హృదయాలు బరువెక్కాయి.