అన్నమయ్య సంకీర్తన శ్రీపాదుక సీడీలను ఆవిష్కరిస్తున్న దృశ్యం
పదకవితా పితామహుడు అన్నమయ్య భక్తి సంకీర్తనల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు కృషి చేస్తోందని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి తెలిపారు.
- 2162 సంకీర్తనల రికార్డింగ్ పూర్తి
 - ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మునిరత్నం వెల్లడి
 
	
	తిరుపతి కల్చరల్: పదకవితా పితామహుడు అన్నమయ్య భక్తి సంకీర్తనల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని  జన బాహుళ్యంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు కృషి చేస్తోందని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి తెలిపారు.  శ్రీవారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని అన్నమాచార్య మందిరంలో  బుధవారం  ‘అన్నమయ్య సంకీర్తన శ్రీపాదుక’,  ‘అన్నమయ్య వేంకటనాథ వైభవం’ సీడీలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటి వరకు 2,162కు పైగా అన్నమయ్య సంకీర్తనలను స్వరపరచి రికార్డింగ్ పూర్తి చేశామన్నారు.  అన్నమయ్య సంకీర్తనల  విశిష్టతను భక్తులకు తెలియజేసేందుకు ప్రతి నెలా శ్రవణా నక్షత్రం రోజున సీడీలను ఆవిష్కరిస్త్నుట్లు చెప్పారు.  బాల, యువ, నిష్ణాతులైన కళాకారులతో సంకీర్తనలను స్వరపరచి, గానం చేసి, రూపొందిస్తున్న సీడీలకు విశేష స్పందన లభిస్తోందన్నారు.  మరో 25 సీడీలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.  ‘అన్నమయ్య సంకీర్తన శ్రీపాదుక’ సీడీలోని సంకీర్తనలను హైదరాబాద్‌కు  చెందిన  సత్తిరాజు వేణుమాధవ్ స్వరపరచి గానం చేశారు.  అలాగే  ‘అన్నమయ్య వేంకటనాథ వైభవం’ సీడీలోని సంకీర్తనలను తిరుపతికి చెందిన  పి.రామనాథన్ స్వరపరచగా రమణవాణి , సరస్వతి ప్రసాద్ గానం చేశారు.  కార్యక్రమంలో  టీటీడీ అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
