లైన్లన్నీ బిజీ | all lines busy | Sakshi
Sakshi News home page

లైన్లన్నీ బిజీ

Feb 5 2017 12:56 AM | Updated on Oct 4 2018 5:44 PM

లైన్లన్నీ బిజీ - Sakshi

లైన్లన్నీ బిజీ

ఉండి/అత్తిలి : నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద, పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద, ఇప్పుడిదిగో రేషన్‌ సరుకుల కోసం డిపోల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

ఉండి/అత్తిలి :  నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద, పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద, ఇప్పుడిదిగో రేషన్‌ సరుకుల కోసం డిపోల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నెల నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రేషన్‌ సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్‌ షాపు వద్ద క్యూ లైన్లు చాంతాడంత ఉంటున్నాయి. సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో రోజుకు పదిమందికి కూడా రేషన్‌ అందే పరిస్థితి లేదు. ఒక ఇంటిలో తండ్రి పింఛను కోసం లైన్లో ఉంటే.. కొడుకు నగదు కోసం బ్యాంకు క్యూ లైన్లో, తల్లి రేషన్‌ సరుకుల కోసం డిపో వద్ద క్యూలో పడిగాపులు పడాల్సిన దుస్థితి జిల్లాలో ఏర్పడింది. ఆ విధంగా ముందుకు పోవడమంటే ఇదేనేమో!    
పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం చక్కగా సాగిపోయే వ్యవస్థను నిర్వీర్యం చేయనారంభించింది. క్యాష్‌లెస్‌ అంటూ రేషన్‌ సరుకులకు వచ్చిన వారితో వేలిముద్రలు వేయించుకుంటూ బ్యాంకు ఖాతా ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాంకులకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడం ఒక కారణమైతే, ఆధార్‌ లింక్‌ కాకపోవడం మరొక కారణ. అన్ని సక్రమంగా సాగుతున్నాయని అనుకునే సమయంలో సర్వర్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో రోజుల తరబడి లబ్ధిదారులు రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రతినెలా 5వ తేదీ నాటికి రేషన్‌ ఇవ్వడం ముగించి 6వ తేదీకి మిగిలిన సరుకు బ్యాలె న్స్‌ 
గా చూపించాలి. కాని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కనీసం 30 శాతం కూడా రేషన్‌అందించలేకపోయారు. అలాగే మరికొన్ని రేషన్‌ షాపుల్లో ఒక్కకార్డుకు కూడా రేషన్‌ ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇది వారు చేసుకున్న పాపం అన్నట్టు ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే రేషన్‌ డీలర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. క్యాష్‌లెస్‌ ట్రాన్సక్షన్స్‌ అంటూ ప్రారంభించిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేయకుండా నాసిరకం యంత్రాలను తమ మొహాన కొట్టి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు  గురిచేస్తోందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు దుకాణానికి వచ్చిన ప్రజలు ఒకటికి  రెండుసార్లు ఇంటికి వెళ్లయినా వస్తున్నారు. కాని డీలర్ల పరిస్థితి అలా లేదు, ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు సర్వర్‌ కనెక్ట్‌ అవుతుందా? అని ఎదురుచూడటమే పెద్ద పనిగా మారిపోయింది. ఇలాగైతే నెల రోజులైనా రేషన్‌ పంపిణీ పూర్తి కాదని వాపోతున్నారు.                 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement