మట్కా నిర్వాహకులతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదివారం తెలిపారు.
హిందూపురం అర్బన్: మట్కా నిర్వాహకులతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదివారం తెలిపారు. హిందూపురం కేంద్రంగా బహిరంగంగా సాగుతున్న మట్కాపై ‘బతుకులు క్లోజ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ స్పందించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించవద్దని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో డీఎస్పీ రెండు రోజులుగా హిందూపురంలో మకాం వేశారు. మట్కా నిర్మూలన కంటే ముందు సొంత ఇంటి (పోలీసు శాఖ)ని చక్కదిద్దాలని నిర్ణయించుకున్నారు. మట్కా నిర్వాహకులతో సన్నిహితంగా ఉంటున్న ఇద్దరిలో ఒకరిని సబ్‌జైలు, మరొకరిని అమరాపురం స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇంకో నలుగురిని ఇతర విధులకు అప్పగించారు. మరింత లోతుగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ చెప్పారు. అసాంఘిక శక్తులతో సంబంధాలు కల్గిన వారు ఎంతటివారైనా ఊపేక్షించేది లేదన్నారు.
మట్కా బీటర్లకు కౌన్సిలింగ్:
పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మట్కారాస్తున్న 14 మంది బీటర్లకు ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ కరీముల్లా షరీఫ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మట్కా రాయడం మానుకోవాలన్నారు. మట్కా నిర్వహకులనూ వదిలేది లేదన్నారు. పద్ధతి మార్చుకోకపోతే కఠినమైన సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.