ఐటీసీ పీఎస్‌పీడీలో ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఐటీసీ పీఎస్‌పీడీలో ప్రమాదం

Published Sun, Oct 25 2015 3:44 AM

Accident in ITC PSPD

కార్మికుడి మృతి.. మరో ఐదుగురికి అస్వస్థత

 బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక పర్మనెంట్ కార్మికుడు మృతి చెందగా, మరో కాంట్రాక్ట్ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో మరో ఐదుగురు కార్మికులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐటీసీ పీఎస్‌పీడీలోని ఎస్‌ఆర్‌పీ (సోడా రికవరీ ప్లాంట్)లో సాంకేతిక లోపాలను సరిచేస్తున్న క్రమంలో కొద్ది పరిమాణంలో ఎన్‌సీజీ (నాన్ కన్‌జెన్షబుల్ గ్యాస్) లీకవటంతో అక్కడ పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుడు పీఎల్‌ఎన్ ప్రసాద్, అతడి పక్కనే ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వీరిని రక్షించేందుకు అక్కడికి వెళ్లిన మరో ఐదుగురు కార్మికులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఐటీసీలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్సలు నిర్వహించి.. వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పీఎల్‌ఎన్ ప్రసాద్ (28) మృతి చెందాడు. కాకినాడకు చెందిన ప్రసాద్‌కు 11 నెలల క్రితమే వివాహం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు.

అస్వస్థతకు గురైన మరో ఐదుగురు కార్మికులకు కూడా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ఐదుగురి ఆరోగ్యం పట్ల  ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వాకబు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement