
కేంద్ర కోటాలో 50 మెగావాట్ల కోత!
కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న విద్యుత్‌లో 50 మెగావాట్లకు కోత పడింది.
కర్ణాటకకు 200 మెగావాట్ల అదనపు కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న విద్యుత్‌లో 50 మెగావాట్లకు కోత పడింది. తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న కర్ణాటకకు అదనంగా 200 మెగావాట్ల విద్యుత్‌ను తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ కేటాయించింది. ఇందుకోసం దక్షిణాది గ్రిడ్ పరిధిలో ఉన్న తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ కోటాల నుంచి 50 మెగావాట్ల చొప్పున మొత్తం 200 మెగావాట్ల కోత విధించింది.
ప్రస్తుతం కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 1,500 మెగావాట్ల సరఫరా అవుతుండగా, అందులో 50 మెగావాట్ల విద్యుత్ సరఫరా తగ్గిందని తెలంగాణ ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా పెరిగితే అదనంగా 200 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు జరపాలని కేంద్ర విద్యుత్ శాఖకు రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాసింది.