90 శాతం ఆ వీడియోల తొలగింపు

YouTube removed 90 percent Pollachi Abuse videos - Sakshi

పొల్లాచ్చి వ్యవహారంలో యూట్యూబ్‌ వివరణ 

సాక్షి, చెన్నై ‌: పొల్లాచ్చి లైంగిక దాడి వ్యవహారంలో 90 శాతం వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్‌ సంస్థ సీబీసీడీ పోలీసులకు శనివారం వివరణ ఇచ్చింది. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇలావుండగా బాధిత యువతుల వీడియోలు ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వీడియోల వ్యాప్తిని అడ్డుకోవాలని సీబీసీఐడీ పోలీసులు యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ సంస్థలకు లేఖలు పంపారు. రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో మరో ఆడియో విడుదలైంది. అందులో పొల్లాచ్చి ముఠా దాడికి గురైన బాధితురాలినంటూ ఒక యువతి గళం వినిపించింది. 

అందులో ముఠా ఒక బాలికపై రాత్రంతా లైంగికదాడి జరపగా మృతిచెందిందని, ఆ బాలిక మృతదేహం తిరునావుక్కరసు ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టి ఉన్నట్లు తెలిపింది. ఇది ఈ కేసులో మళ్లీ సంచలనం కలిగించింది. ఈ వీడియోలో వాస్తవాల గురించి సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మళ్లీ యూట్యూబ్‌ సంస్థకు లేఖ రాశారు. ఈ ఆడియో పోస్టు చేసిన వ్యక్తి వివరాలు తెలపమని కోరారు. ఇలావుండగా పొల్లాచ్చి సంఘటనకు సంబంధించిన వీడియోలను తొలగించాలని కోరడంతో 90 శాతం వీడియోలు తొలగించినట్లు, మార్ఫింగ్‌ చేసిన కొన్ని వీడియోలు మాత్రం ఉన్నట్లు యూట్యూబ్‌ సంస్థ సీబీసీఐడీ పోలీసులకు శనివారం వివరణ ఇచ్చింది. 

మణివన్నన్‌ను విచారించిన సీబీసీఐడీ 
పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో నిందితుడు మణివన్నన్‌ను పోలీసులు శనివారం విచారణ  చేశారు. పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో బాధిత కళాశాల విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫైనాన్సర్‌ తిరునావుక్కరసు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా విద్యార్థిని అన్నపై దాడి చేసిన బార్‌ నాగరాజ్, సెంథిల్, వసంతకుమార్, బాబు అరెస్టయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న పొల్లాచ్చి అచ్చిపట్టి ప్రాంతానికి చెందిన మణివన్నన్‌ (28) గత 25వ తేదీన కోయంబత్తూరు కోర్టులో లొంగిపోయాడు. అతన్ని 11 రోజుల కస్టడీలో విచారణ జరిపేందుకు సీబీసీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మణివన్నన్‌ వద్ద నాలుగు రోజులపాటు విచారణ జరిపేందుకు న్యాయమూర్తి నాగరాజన్‌ ఉత్తర్వులిచ్చారు. దీంతో మణివన్నన్‌ను పోలీసులు శనివారం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top