ప్రాణం తీసిన ప్రేమ..

Young Woman Commits Suicide in front of Her Boyfriend in Hyderabad - Sakshi

ప్రియుడి సమక్షంలోనే యువతి ఆత్మహత్యాయత్నం

చికిత్సపొందుతూ మంగళవారం మృతి  

ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ప్రియుడే చంపాడంటున్న మృతురాలి బంధువులు

కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు...పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు..యువతి తల్లిదండ్రులు మందలించినా తీరు మార్చుకోలేదు...చివరికి ఏమైందో  అతడి సమక్షంలోనే ఓ యువతి విషం కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, మైసంపల్లి గ్రామానికి చెందిన సిద్దిరాల లక్ష్మణ్, స్వరూప దంపతుల కుమార్తె సిద్దిరాల జ్యోతి (24) డిగ్రీ పూర్తి చేసింది. కేపీహెచ్‌బీకాలనీ నాలుగో ఫేజ్‌లో ఉంటూ బేగంపేట ప్రకాష్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. డిగ్రీ చదువుతున్న సమయంలో తన స్నేహితురాలి సోదరుడు రాకేష్‌రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

గత  రెండేళ్లుగా రాకేశ్‌రెడ్డి  ప్రేమిస్తున్నానంటూ జ్యోతి వెంటపడుతుండటంతో బాధితురలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె తండ్రి లక్ష్మణ్‌ రాకేష్‌రెడ్డి్డని పలుమార్లు  మందలించాడు. అయినా రాకేష్‌రెడ్డి్డ తన వైఖరి మార్చుకోకపోగా జ్యోతికి పలుమార్లు ఫోన్‌చేసి వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి ఆమె కాలనీలోని తొమ్మిదో ఫేజ్‌లో ఉన్న పార్కుకు వచ్చింది. ఆ తర్వాత గంట సేపటికి జ్యోతి సెల్‌ నుంచే రాకేశ్‌రెడ్డి ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మీ అమ్మాయి విషం తాగిందని అనుపమ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం అందించాడు. దీంతో వారు ఆసుపత్రికి చేరుకోగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. మంగళవారం  మధ్యాహ్నం జ్యోతి మృతి చెందినట్లు  వైద్యులు ధ్రువీకరించారు. దీంతో జ్యోతి తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు రాకేష్‌రెడ్డి్డని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జ్యోతి, రాకేష్‌రెడ్డి్డ మొబైల్‌ఫోన్‌లో జరిగిన సంబాషణలు, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాగా రాకేష్‌ రెడ్డి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి జ్యోతిని హత్య చేశాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అనుమానాలెన్నో?
జ్యోతి మృతిపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జ్యోతి పార్కుకు రావాల్సిన అవసరం ఏముంది. స్వతహాగా వచ్చిందా..రాకేష్‌రెడ్డి ఒత్తిడిమేరకు వచ్చిందా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిద్దరి సెల్‌ఫోన్‌ కాల్స్, వాట్సాప్‌ చాటింగ్‌లపై దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top