
పెద్దేముల్: పెద్దలు నిర్వహించిన పంచాయితీ ఓ యువకుడి ప్రాణం తీసింది. బాలికతో ప్రేమాయణం నడిపించిన యువకుడు.. రెండెకరాల భూమి, డబ్బులు అమ్మాయి కుటుంబీకులకు ఇవ్వాలని చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్‌లో శుక్రవారం జరిగింది. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బక్కని మొగులప్ప, లాలమ్మ దంపతుల మూడో కుమారుడు అశోక్ (23) డిగ్రీ చదువుతున్నాడు.
అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు, యువకుడితో పెళ్లి విషయమై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, గురువారం సాయంత్రం హన్మపూర్‌లో సర్పంచ్ నర్సింలు గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, రెండు ఎకరాల భూమి అశోక్ ఇవ్వాలని తీర్పు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. మృతుడి సోదరుడు రమాకాంత్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ నర్సింలు, రాములుపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.
బాల్యవివాహాన్ని అడ్డుకున్నందుకే..: సర్పంచ్
బాల్య వివాహం చేసుకుంటే చట్టపరంగా కేసు నమోదు అవుతుందని ఇరు కుటుంబాలవారికి నచ్చచెప్పానని సర్పంచ్ నర్సింలు తెలిపారు. అమ్మాయి మేజర్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని చెప్పడంతో తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించారన్నారు.