అమ్మా.. నేనేమి చేశాను నేరం

Women Suicide Attempt In Karimnagar - Sakshi

అమ్మా.. నేనేమి చేశాను నేరం కడుపున పడంగనే ఆనందపడ్డావు..! కష్టమనకా.. నవమాసాలు మోశావు..!!  పురిటినొప్పులు భరించి జన్మనిచ్చావు..! అల్లారుముద్దుగా పెంచుకుని లాలించావు..!! కష్టమొచ్చిందని.. కన్నపేగు తెంచుకుంటివా..?! లోకం తెలియని నన్ను నీతో తీసుకెళ్లావా..!! అమ్మా.. నేనేమి చేశాను నేరం.! ఆడజన్మ ఎత్తినందుకు ఎందుకీ శాపం..!! ...అంటూ ఆ చిన్నారి అనంతాల్లో కలిసిపోయింది. తండ్రి కట్న పైశాచికత్వాన్ని తట్టుకోలేని ఓ తల్లి లోకాన్ని విడిస్తూ.. కన్నకూతురునూ వెంట తీసుకెళ్లింది. కట్నం వేధింపులకు కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండ లం వంతడుపులలో బూర్ల రమ్య(28) తన కూతురు మనుశ్రీ(4)తో కలిసి చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.  – ఇల్లందకుంట(హుజూరాబాద్‌)
 

 సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): ,పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం వంతడుపుల  గ్రామానికి చెందిన బూర్ల గణేశ్‌కు ఇదే మండలం మల్యాల గ్రామానికి చెందిన రమ్యతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నకానుకలుగా రూ. మూడున్నర లక్షలు అందించారు. మొదటల్లో వీరి కాపురం సజావుగా సాగింది. రెండేళ్లకు మనుశ్రీ జన్మించింది. అప్పటి నుంచి గణేశ్‌ తీరులో మార్పు వచ్చింది. ఏ పని చేయకుండా ఖాళీగా తిరగడం ఆరంభించాడు. నిత్యం రమ్యను వేధించేవాడు. దీనికి గణేశ్‌ తల్లిదండ్రులు కొమురమ్మ, పోశయ్య, ఆడబిడ్డ వనిత వత్తాసు పలికి నిత్యం అదనపు కట్నం తేవాలని శారీరకంగా, మానసికంగా వేధించేవారు.ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. కూతురు కాపురం బాగుండాలని రమ్య తల్లిదండ్రులు గణేశ్‌ అడిగిన మొత్తాన్ని దశలవారీగా ముట్టజెప్పారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. మరింత డబ్బు కావాలని రమ్యనే వేధించాడు.

ఈ క్రమంలో కొద్ది మాసాల క్రితం తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని అమ్మేందుకు గణేశ్‌ పూనుకోగా.. దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో రమ్య పుట్టింటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. పొలం అమ్మవద్దని, మరో రూ.లక్షను మనుమరాలి పేరిట బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. కిరాణాషాపు నిర్వహించుకోవాలని  అవసరమైన సామగ్రిని సైతం కొనిచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం దంపతుల మధ్య గొడవ జరిగింది. సాయంత్రం పూట కూతురు మనుశ్రీని తీసుకుని వెళ్లి ఇంటి శివారులో ఉన్న చాదబావిలో దూకింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు.

బుధవారం వేకువజామున రెండు మృతదేహాలు బావిలో తేలాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న హుజురాబాద్‌ ఏసీపీ టి. కృపాకర్, తహసీల్దార్‌ రమేశ్‌ ఘటనాస్థలానికి వచ్చారు. బావిలో నుంచి మృతదేహాలు తీయించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి రమేశ్‌ ఫిర్యాదుతో రమ్య భర్త గణేశ్, అత్తామామలు కొమురమ్మ, పోశయ్య, ఆడబిడ్డ వనితపై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top