
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయ ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. లోకేశ్వరి(45) అనే మహిళ మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రవీణ్ అనే వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. వెంటనే స్పందించిన కానిస్టేబుళ్లు మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. లోకేశ్వరి శరీరం తీవ్రంగా కాలిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఘటనా స్థలానికి పంజాగుట్ట ఏసీపీ చేరుకున్నారు.