పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త

Woman Complaint On Husband Cheating - Sakshi

ఎస్పీ కార్యాలయంలో బాధితురాలి ఫిర్యాదు

పెదవాల్తేరు(విశాఖతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడేమో ఇంట్లో పెద్దవాళ్లకు ఇష్టం లేదు కాపురం చేయనని కరాఖండిగా చెప్పేశాడో ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు శుక్రవారం పెదవాల్తేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివ(23), తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదిమాతాండ గ్రామానికి చెందిన బాణోయ అనసూయ(20) 2016 సంవత్సరంలో ప్రేమించుకున్నారు. ఆమె బి.ఫార్మసీ చదువుకుని హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు.

శివ రాజమండ్రి ఆదిత్య కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసేవాడు. వీరిద్దరూ 2017 డిసెంబర్‌ 23న స్నేహితుల సాయంతో సూర్యాపేటలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఐదు నెలల పాటు కాపురం చేసిన శివ అర్ధంతరంగా ముఖం చాటేశాడు. అదేమంటే తన ఇంట్లో తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడం గమనార్హం. దీంతో బాధితురాలు రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయింది. పైగా రావికమతం ఎస్‌ఐ రామకృష్ణ, కానిస్టేబుల్‌ భవాని, సీడీపీవో మంగతాయారు.. శివకు వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top