ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నారా.. 

While Going On A Vacation Inform The Police - Sakshi

సెలవుల్లో జర పైలం!

దొంగలు పడే అవకాశం!

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పోలీసులు

సాక్షి, నిజామాబాద్‌: దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్‌ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో  దొంగతనాలకు పాల్పడుతుంది.  

ఇదీ పరిస్థితి  
జిల్లాలో గతంలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే 2017లో రాత్రిపూట 192, పగటిపూట 34, 2018లో రాత్రిపూట 206, పగలు 42, 2019లో రాత్రిపూట 120 , పగలు 14 దొంగతనాలు జరిగాయి. ఇలా  దొంగతనాల సంఖ్య పెరుగుపోతుంది. జిల్లా కేంద్రంలో ముబారక్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఇంటిపై దొంగతనానికి ప్రయత్నించారు. ఏకకాలంలో వినాయక్‌నగర్, శ్రీనగర్‌ కాలనీలో బంగారు దుకాణాల్లో మహారాష్ట్ర కు చెందిన ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఇటీవల సీతారాంనగర్‌కాలనీలో ఓ కారును ఎత్తుకెళ్లారు. ఇదే ప్రాంతంలో మరో మూడు ఇళ్లలో వారం రోజుల్లోనే చోరీలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్‌ చేశారు. 

సీసీ కెమెరాలు ఎంతో మేలు 
ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగనాలు నివారించవచ్చు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో సీసీ కెమెరాలను గమనించి దొంగలు వెనకడుగు వేశారు. సీసీ కెమెరాలు ఉంటే చోరీ జరిగిన దొంగలను త్వరగా పట్టుకోవచ్చు. సెలవుల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయడం ద్వారా కూడా చోరీలను అదుపు చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఇదివరకే ప్రత్యేక పెట్రోలింగ్‌ వాహనాల ద్వారా రాత్రి వేళలో పెట్రోలింగ్‌ చేస్తున్నారు.  

  •      ఇళ్లకు తాళం వేసి, ఊర్లకు వెళ్లే వారు పలు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. 
  •      ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్‌ ఏక్‌మాల్‌ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి 
  •      రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి 
  •      విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు 
  •      ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి 
  •      వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి 
  •      పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది 
  •      ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవడం మంచిది. 
  •      కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి 
  •      తాళం వేసి ఊరు వెళ్లే ముందు సమీప పోలీసుస్టేషన్‌లో సమాచారం అందించాలి 

జాగ్రత్తలు తీసుకోండి 
ఇంటికి తాళం వేసే వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు ఇంటిలో పెట్టుకోవద్దు. అలాగే రాత్రి వేళలో  ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ కొనసాగుతుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం అందించాలి.
 – ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top