ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో బురిడీ | Two Men Arrest in Online Lottery Fraud | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో బురిడీ

Apr 28 2018 9:03 AM | Updated on Aug 20 2018 4:27 PM

Two Men Arrest in Online Lottery Fraud - Sakshi

నిందితుల వివరాలు తెలియజేస్తున్న డీసీపీ గజరావ్‌ భూపాల్, చిత్రంలో నిందితులు సోను కుమార్, అరుణ్‌కుమార్‌

విజయవాడ: ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి డబ్బు దండుకునే ఇద్దరు నిందితులను కమిషనరేట్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ గజరావు భూపాల్‌ వెల్లడించారు. ‘హలో, మాదొక ప్రముఖ కంపెనీ, లాటరీ తీశాం, అందులో మీరు అధిక మొత్తంలో నగదు గెలుచుకున్నారంటూ’ మెసేజ్‌ పంపి, ఆ డబ్బు మీకు రావాలంటే పూర్తి వివరాలు చెప్పి కొంత డబ్బును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుందని మెయిల్‌ ఇస్తారు. దాన్ని నమ్మి బ్యాంకు ఖాతాలకు  నగదు పంపిన వారి డబ్బులు గల్లంతు చేసే ఇద్దరిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. పై విధంగా నేరాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుధేరా గ్రామానికి చెందిన సోను కుమార్, యూపీకి చెందిన ఒసిక్క గ్రామస్తుడు సి.చమాల్‌ అలియాస్‌ అరుణ్‌ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించటంతో వారు చేసిన సైబర్‌ నేరాలు వెల్లడించారు.

మోసం ఎలా అంటే..
గత ఫ్రిబవరి 6వ తేదీ ఉయ్యూరు సర్కిల్‌ పరిధిలో తోట్లవల్లూరు పోలీస్టేషన్‌ ఏరియాలో ఓ మహిళకు రూ.5.35కోట్లు లక్కీడ్రా ఇచ్చినట్లుగా మోసపూరిత మెసేజ్‌ పెట్టారు. ఆమె వద్ద నుంచి మూడు దఫాలుగా రూ.1.61లక్షలు తమ అకౌంట్‌లో డిపాజిట్‌ చేయించుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోట్లవలూర్లు పోలీసులు కేసు నమోదు చేసి సైబర్‌ నేరాలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. నిందితులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 345 మందితో కాంట్రాక్ట్‌ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు హైదరాబాద్‌లో ఇద్దరిని, వైజాగ్‌లో ఇద్దరిని లాటరీ పేరుతో మోసగించి రూ. 3లక్షలు అపహరించినట్లు చెప్పారు.

తోట్లవల్లూరు పోలీసులు సూచనల మేరకు హైదరాబాద్, వైజాగ్‌లో డబ్బుపోగొట్టుకున్న బాధితులు ఆక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తోట్లవల్లూరు కేసుకు సంబంధించి రూ.1.60లక్షలు నగదు,  15 బ్యాంక్‌ అకౌంట్లు, 5మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. నిందితులకు సంబంధించి 15 అనుమానాస్పద బ్యాంకు అకౌంట్లను గుర్తించి వాటిలో 8 అకౌంట్ల నుంచి రూ. 50వేల నగదును సీజ్‌ చేశారు. ఆయా అకౌంట్లలో రూ. 44లక్షల అనుమానాస్పద నగదు లావాదేవీలను గుర్తించారు. విలేకరుల సమావేశంలో ఉయ్యూరు సీఐ సత్యానందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement