గర్భశోకం

Twins Death In amil Nadu With Dendue Fever - Sakshi

మరణంలోనూ కలిసిమెలిసి కవలలను పొట్టనపెట్టుకున్న డెంగీ జ్వరం

తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు

ఐదేళ్ల నోములు, వ్రతాల ప్రతిఫలంగా జన్మించిన చిన్నారులకు ఏడేళ్ల   ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. లేకలేక కలిగిన సంతానంకావడంతో తల్లిదండ్రులు ఆ కవలలను రెండుకళ్లలా కాపాడుకుంటూ వచ్చారు. డెంగీ జ్వరం రూపంలో ఆ కవలలను విధి కాటేసింది. ఒకేసారి పుట్టిన వారిని ఒకేసారి కాటికి చేర్చింది. ఆ తల్లికి ఏర్పడిన గర్భశోకం ఎవ్వరూ ఓదార్చలేనిది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కొళత్తూరు తణికాచలం నగర్‌కు చెందిన సంతోష్, గజలక్ష్మిలకు 2004లో వివాహమైంది. అయితే ఏళ్లు దాటుతున్నా సంతానం కలుగలేదు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన ఆ దంపతులు ఎక్కని ఆలయం లేదు, మొక్కని దేవుడు లేడు. నోములు, వ్రతాలు ఆచరించారు. ఆ దేవుడు వారి ఆవేదనను తీర్చినట్లుగా 2011లో దక్షిణ్‌ (7) అనే కుమారుడు, దీక్ష (7) అనే కుమార్తె కలిగారు. వీరిద్దరూ కవలలు, పైగా ఆడ, మగ సంతానం ఒకేసారి కలగడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అదే ప్రాంతంలోని ప్రయివేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నారు. ఇదిలా ఉండగా పిల్లలిద్దరికీ వారం రోజుల క్రితం జ్వరం సోకింది. ఏమాత్రం అలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే వారిద్దరికీ జ్వరం తగ్గకపోగా తీవ్రమైంది. దీంతో వారిద్దరినీఈనెల 20 వ తేదీన చెన్నై ఎగ్మూరు ఆస్పత్రిలో చేర్పించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స ప్రారంభించారు.

అయితే దురదృష్టశాత్తూ చికిత్స ఫలించక ఆదివారం రాత్రి 11 గంటలకు దీక్ష మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ కన్నీటి తడి ఆరక ముందే మరో ఘోర సమాచారం వారి చెవినపడింది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో దక్షిణ్‌ సైతం ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలపడంతో దుఃఖాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరూ తల్లడిల్లిపోయారు. భార్యాభర్తలు విలపిస్తున్న తీరుచూసి మొత్తం వార్డులోని వారంతా ఆవేదన చెందారు.  ఒకేసారి జన్మించడమేకాదు, ఒకేసారి మరణించడం, ఇంట ముంగిట ఒకేసారి రెండు శవపేటికల్లో చిన్నారుల మృతదేహాలను చూస్తూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం బంధువులను, ఇతరులను సైతం కన్నీరుపెట్టించింది. కవలల మృతిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ, తాము నివసించే తణికాచలం నగర్‌లో ఎక్కడ చూసిన మురుగునీరు నిలిచిపోయి దుర్గంధంగా మారింది. ప్రజలు తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్నారు. చివరకు ఇద్దరు చిన్నారులే ప్రాణాలు కోల్పోయారు. డెంగీ జ్వరాల అదుపునకు ప్రభుత్వం ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top