టార్గెట్‌ చిరుత

Tiger Skin Smugglers Arrest in Hyderabad - Sakshi

పులి, చిరుత చర్మంతో వ్యాపారం  

బ్లాక్‌ మార్కెట్‌లో రూ.లక్షల్లో డిమాండ్‌  

చిరుత చర్మం రూ.5లక్షలు.. పులి చర్మం రూ.25లక్షలు  

అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు  

చిరుత చర్మం, నాలుగు గోళ్లు స్వాధీనం  

సాక్షి, సిటీబ్యూరో: వివిధ రాష్ట్రాల అడవుల్లోని చిరుతలు, పులులే లక్ష్యంగా వేట సాగించి వాటి చర్మం, గోళ్లను బ్లాక్‌ మార్కెట్‌లో రూ.లక్షలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి చిరుత చర్మం, నాలుగు గోళ్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ శివయ్యలతో కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. చిరుతలు, పులులు ఎక్కువగా సంచరించే సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతం, మహారాష్ట్ర తడోబా అటవీ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం  ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, వైజాగ్‌ అటవీ ప్రాంతాల్లో 8–10 మంది సభ్యుల ముఠా వేట కొనసాగించేది. చిరుత, పులి చర్మం, గోళ్లు బ్లాక్‌ మార్కెట్‌లో రూ.లక్షల్లో ధర పలుకుతుండడంతో ప్రొఫెషనల్‌ వేటగాళ్లు అయిన ఒడిశాకు చెందిన వీరు గత కొన్ని నెలలుగా వాటిపై దృష్టి కేంద్రీకరించారు.

ఆయా జంతువుల కదలికలపై వీరికి ఎక్కువగా అవగాహన ఉండడంతో... ఆయా ప్రాంతాల్లో తీగల ఉచ్చులు ఏర్పాటు చేసి వలపన్ని పట్టుకునేవారు. ఈ విధంగానే మూడు నెలల క్రితం ఓ మగ చిరుతను చంపి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి ఎండబెట్టారు. రెండేళ్ల వయసున్న ఈ చిరుత చర్మాన్ని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తామని తమ పరిచయస్తులకు ఒడిశాకు చెందిన బసుదేవ్‌ మస్తీ, జగన్నాథ్‌ సిసా, బలి పంగి చెప్పారు. అయితే వీరికి సహకరిస్తున్న విశాఖపట్టణానికి చెందిన నాగోతి భాను హైదరాబాద్‌లో విక్రయిద్దామని సూచించాడు. ఎల్‌బీనగర్‌లోని మయూరి హోటల్‌లో సోమవారం కస్టమర్‌ కోసం వేచి చూస్తుండగా... సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, సివిల్‌ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. చిరుత చర్మం, గోళ్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

అవసరాన్ని బట్టి...  
కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా వీరు చిరుత, పులులను చాకచాక్యంగా వేటాడేవారు. తీగల ఉచ్చులో పడేలా చూసి చంపేవారు. ఆ తర్వాత జాగ్రత్తగా చర్మాన్ని తొలగించడంతో పాటు గోళ్లను తీసేసి కస్టమర్లకు విక్రయించేవారు. చిరుత చర్మాన్ని కొన్నిసార్లు రూ.5లక్షలకు, మరీ డిమాండ్‌ ఉంటే రూ.10 లక్షలకు అమ్మేవారు. పులి చర్మాన్ని మాత్రం రూ.25లక్షలకు విక్రయించే వారని సీపీ మహేశ్‌ భగవత్‌ వివరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top