బెంగళూరులో కామారెడ్డి టీడీపీ నేత అదృశ్యం

Tdp leader Missing In Bangalore - Sakshi

సాక్షి, కామారెడ్డి: టీడీపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ ఉస్మాన్‌ మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. ఈనెల 2వ తేదీన కామారెడ్డి నుంచి ఇంటి నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిన ఉస్మాన్‌ చివరగా 9న పట్టణ టీడీపీ అధ్యక్షుడు నజీరొద్దీన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. మరుసటి రోజు నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడం, ఎంతకూ ఆయన ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఈనెల 15న కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉస్మాన్‌కు మంచి పేరు ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు.  కామారెడ్డితోపాటు హైదరాబాద్‌లో రియల్‌ దందా చేసేవాడు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

కాగా ఈ నెల 2న హైదరాబాద్‌కు అక్కడి నుంచి బెంగుళూరుకు వెళ్లిన ఉస్మాన్‌ అక్కడి నుంచి ఎటు వెళ్లాడు ? ఫోన్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంచాడు.? అన్నది తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ ఉస్మాన్‌కు ఏ ఇబ్బంది లేదు. వ్యాపారంలో రాణించాడు. అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఏవైనా గొడవలు ఉన్నాయా అన్నది తెలియరాలేదు. ఉస్మాన్‌ జాడ కోసం కుటుంబ సభ్యులు బెంగుళూరుకు వెళ్లారు. ఈ విషయమై కామారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top