రైల్వే పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు

TDP Leader Arrested In Nellore - Sakshi

రూ.50 లక్షలు మాయం చేసిననకిలీ రైల్వే పోలీసులు

బంగారు వ్యాపారి ఫిర్యాదుతో రైల్వే పోలీసుల విచారణ

ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా రవిని అదుపులోకి తీసుకున్న వైనం

కావలి: మండలంలోని చెన్నాయపాళేనికి చెందిన  టీడీపీ నాయకుడు మర్రి రవిని శనివారం వేకువన నెల్లూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారు బిస్కెట్‌ల దందాకు సంబంధించిన రూ.50 లక్షలను నకిలీ రైల్వే పోలీసులు మాయం చేశారు. బంగారు వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రైల్వేపోలీసులు చెన్నాయపాళెం చేరుకుని రవిని అదుపులోకి తీసుకోవడం గ్రామంలో కలకలం రేగింది. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా విషయం తెలుసుకుని తొందరపడి జోక్యం చేసుకుంటే అభాసుపాలవుతామని మిన్నకుండిపోయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు జీరో దందా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

చెన్నైలో బంగారాన్ని బిల్లులు లేకుండా కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. స్థానిక  వ్యాపారి ఒకరు రూ.50లక్షలు చెన్నై నుంచి బంగారాన్ని తీసుకొచ్చే సీజన్‌ బాయ్‌కి అప్పగించాడు. పోలీసులు, ఐటీ అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు మహిళలను అతనికి తోడుగా పంపాడు. బుధవారం నవజీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వీరు నెల్లూరుకు చేరుకోగానే రైల్వే పోలీసులమని కొందరు వ్యక్తులు వచ్చి రూ.50లక్షలు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీజన్‌ బాయ్‌ కావలిలోని బంగారు వ్యాపారికి తెలియజేశాడు. వెంటనే సదరు వ్యాపారి తనకు పోలీసు వర్గాల్లో ఉన్న పరిచయాల ద్వారా నగదు తీసుకెళ్లింది నకిలీ పోలీసులని నిర్ధారించుకుని నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు  సీజన్‌ బాయ్‌తో పాటు ఇద్దరు మహిళలను విచారించారు. మహిళల్లో ఒకరి ఫోన్‌ నుంచి టీడీపీ నాయకుడు రవి ఫోన్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్‌ వెళ్లిన విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు రవిని అదుపులోకి తీసుకుని నెల్లూరు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. కాగా టీడీపీ నాయకుడైన రవికి దూరపు బంధువు వెంకయ్య చెన్నాయపాళెం వీఆర్‌ఏగా వ్యవహరిస్తున్నాడు. వెంకయ్య విడవలూరు మండలం రామతీర్థంలో నివాసం ఉంటున్నాడు. దీంతో రవి వీఆర్‌ఏగా గ్రామంలో హల్‌చల్‌ చేస్తుంటాడు. వివాహితుడైన రవి రాత్రి వేళల్లో గ్రామంలో ఉండడు. తనకు తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక విధులు అప్పగించారని, అందుకే రాత్రి వేళల్లో డ్యూటీలు చేయాల్సి వస్తోందని గ్రామస్తులకు చెబుతుండేవాడు. కాగా జీరో దందాలో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నేరం జరగడానికి ముందు, వెనుక ఆమెతో ఫోన్‌లో పలుమార్లు మాట్లాడడంతో రవిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top