పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ యువకుడికి శిరోముండనం 

Suspension of two constables along with in-charge SI In AP - Sakshi

ఇన్‌చార్జ్‌ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌  

తూర్పు గోదావరి జిల్లాలో ఘటన 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సీరియస్‌ 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం 

సీతానగరం (రాజానగరం)/ఏలూరు టౌన్‌/సాక్షి, అమరావతి: కారు అద్దాలు పగులకొట్టాడంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న ఎస్సీ యువకుడికి పోలీస్‌స్టేషన్‌లోనే శిరోముండనం చేసిన ఘటనలో ఇన్‌చార్జ్‌ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను మంగళవారం సస్పెండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన ఘటన వివరాలిలా..

► ఈ నెల 18 రాత్రి మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది.  
► దీంతో కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  
► అదే సమయంలో కారులో అటుగా వచ్చిన మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్‌ భర్త కవల కృష్ణమూర్తి ‘ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.. లారీని వదిలేయండి’ అని చెప్పడంతో ఆ యువకులు ఆయనతో కూడా గొడవకు దిగి కారు అద్దాలను పగులగొట్టారు. అడ్డుకోబోయిన అడప పుష్కరం అనే అతడిని కొట్టారు.  
► దీంతో గొడవ పడిన ఐదుగురు యువకులపై అడప పుష్కరం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  
► ఆ ఫిర్యాదు మేరకు సోమవారం ఇన్‌చార్జ్‌ ఎస్సై ఫిరోజ్‌ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్‌ తెప్పించి అతడి గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించి విడిచిపెట్టారు.  
► ఈ విషయం వాట్సాప్‌లో హల్‌చల్‌ చేయడంతో మంగళవారం దళిత సంఘాలు రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ బాజ్‌పాయ్‌ దృష్టికి తీసుకువెళ్లాయి.  
► ఘటనను మంత్రులు సుచరిత, ఆదిమూలపు సురేశ్‌ ఖండించారు. మంత్రి విశ్వరూప్‌ రాజమండ్రి ఆస్పత్రిలో బాధితుడు ప్రసాద్‌ని పరామర్శించారు.

తక్షణ చర్యలకు సీఎం ఆదేశం 
దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన డీజీపీ యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సై ఫిరోజ్‌ షాతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడంతోపాటు ఎస్సైని అరెస్టు చేశారు. ఎస్సై, కానిస్టేబుళ్లపై సెక్షన్‌ 324, 323, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్‌ 3(1)(5), 3(2)(వి) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top