కర్నూలు విద్యార్థి, టీచర్‌ రైలులో దొరికారు | a student, teacher nabbed in bopal | Sakshi
Sakshi News home page

కర్నూలు విద్యార్థి, టీచర్‌ రైలులో దొరికారు

Oct 5 2017 4:16 PM | Updated on Nov 9 2018 5:02 PM

a student, teacher nabbed in bopal - Sakshi

భోపాల్ ‌(మధ్యప్రదేశ్‌) : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థితోపాటు అతడితో ఉన్న ఓ మహిళా టీచర్‌ను రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ స్కూలులో సోషల్‌ టీచర్‌గా ఉన్న ఓ మహిళ(27), అదే స్కూల్‌లో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి కొద్దిరోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులు.. రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. విద్యార్థి, ఆ టీచర్‌ ఫొటోలను వాట్సాప్‌ ద్వారా దేశంలోని అన్ని రైల్వే పోలీస్‌ స్టేషన్లకు పంపించారు. దీంతో అన్ని చోట్ల పోలీసులు అప్రమత్తమవగా భోపాల్‌ పోలీసులకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌-6బోగీలో ఢిల్లీ వెళ్తున్న వీరిద్దరు కనిపించారు.

దీంతో వారిని ప్రశ్నించగా తామిద్దరం అక్కా తమ్ముళ్లమని పరిచయం చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నామని చెప్పారు. కానీ వారి మాటలు నమ్మని పోలీసులు, హైదరాబాద్‌ పోలీసులు పంపిన ఫొటోలను పోల్చి చూసి అసలు విషయం గ్రహించారు. వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకొని విద్యార్థి తండ్రికి కబురు పంపించారు. దీంతో ఆయన బుధవారం భోపాల్‌ వెళ్లి రైల్వే పోలీసుల వద్ద ఉన్న తమ కుమారుడిని వెంటబెట్టుకుని తిరుగు పయనమయ్యారు. అదేవిధంగా సదరు టీచర్‌ కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకుని ఆమెను తీసుకొని వచ్చారు. ఈ సంఘటనపై ఎవరూ ఫిర్యాదు చేసుకోలేదు. దీనిపై కర్నూలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement